''పీవీ''తో కాంగ్రెస్‌ను కొట్టిన కమలనాథులు

Update: 2015-06-30 06:18 GMT
రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషాలకు చోటు ఉండకూడదు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ లాంటి వారికి ఇలాంటి విషయాలు ఒక పట్టాన అర్థం కావు. రాజప్రాసాదాన్ని తలపించేలా ఉండే వ్యక్తుల మధ్య తనకు తాను మకుటం లేని మహరాణిగా భావించే సోనియమ్మ మనసు ఒక్కసారి విరిగిందంటే అది ఎప్పటికి అతుక్కోదు. అందులోకి పీవీ నరసింహారావు లాంటి వ్యక్తి.. తనకు చెప్పకుండా కీలక నిర్ణయాలు తీసుకోవటం ఆమె ఒక పట్టాన జీర్ణించుకోలేకపోయారు.

అందుకే.. బతికి ఉన్నప్పుడే ఆయన మీద కక్ష తీసుకున్న ఆమె.. చనిపోయిన తర్వాత కూడా వదల్లేదు. రాజకీయాల్లో ఎప్పుడూ తన గాలి మాత్రమే వీస్తుందని భావించే సోనియమ్మ లాంటి వారు ప్రతికూల వాతావరణాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే.. ఇలాంటి తప్పులే.. తనను బోనులో నిలబెడతాయని.. పెద్దపెద్ద ప్రశ్నలుగా భవిష్యత్తులో నిలదీస్తాయని ఆమె భావించి ఉండరు.

ఏ పీవీ నరసింహారావును సోనియాగాంధీ అవమానించారో.. అదే పేరుతో మోడీ తన ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు. ఒక్క ఏపీలోనే కాదు.. మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసి మరీ ఆయన పీవీకి జరిగిన అన్యాయాన్ని లోకానికి చాటే ప్రయత్నం చేశారు. పీవీకి జరిగిన అవమానాన్ని ఇప్పటివరకూ మోడీ ఉపయోగించినంత భారీగా ఎవరూ ఉపయోగించలేదనాలి.

విమర్శలతో ఎన్నికల ప్రయోజనాన్ని మాత్రమే కాదు.. తదనంతర లబ్థిని పొందాలని భావించిన కమలనాథులు.. తాజాగా ఢిల్లీలో పీవీ ఘాట్‌ ఏర్పాటు చేయటమే కాదు.. దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు కూడా. భారత ప్రధానుల స్మారకాన్ని దేశ రాజధానిలో నిర్మించే సంప్రదాయానికి భిన్నంగా.. పీవీ పేరు ఢిల్లీ వీధుల్లో వినిపించకూడదన్నట్లుగా వ్యవహరించి.. అందుకు తగ్గట్లే అధికారిక ఉత్తర్వులు సైతం ఇచ్చేసి కాంగ్రెస్‌కు చెంప పెట్టుగా పీవీ స్మారకాన్ని బీజేపీ నేతలు పూర్తి చేశారు.

భవిష్యత్తులో ఒక మేధావికి.. దేశ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయటంతో పాటు.. భారత్‌ను ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన పీవీకి దక్కాల్సిన మర్యాదను.. గౌరవాన్ని కాస్త ఆలస్యంగా అయినా కమలనాథులు పూర్తి చేశారు. ఢిల్లీలో కనిపించే పీవీ ఘాట్‌.. కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ పాలనకు నిదర్శనంగా దేశ ప్రజలకు గుర్తు ఉండిపోయేలా కమలనాథులు చేయగలిగారు. చేసిన తప్పునకు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష అనుభవించాలిగా. అందుకు కాంగ్రెస్‌ సైతం మినహాయింపు కాదన్న సత్యం పీవీ ఘాట్‌ చెప్పకనే చెప్పేస్తుంది.

Tags:    

Similar News