బాబుకు ట్వీట్ చేసిన రాం మాధ‌వ్‌!

Update: 2018-05-15 07:33 GMT
గెలుపు వెయ్యి ఏనుగుల బ‌లాన్ని ఇస్తుంది. మామూలోడ్ని సైతం మొన‌గాడ్ని చేస్తుంది. ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో బీజేపీ విజ‌యం అలాంటి ప‌రిస్థితే నెలకొంది. కేంద్రంలో ప‌వ‌ర్లో ఉండి.. ఒక్కో రాష్ట్రాన్ని జ‌యించుకుంటూ వ‌స్తున్న బీజేపీకి క‌ర్ణాట‌క‌లో గెలుపుతో ద‌క్షిణాదిన ఆ పార్టీ అకౌంట్ తెరిచిన‌ట్లైంది. క‌మ‌ల‌నాథుల‌కు ఈ గెలుపు మ‌హా ఉత్సాహాన్ని ఇచ్చింది. దీనికి కార‌ణం లేక‌పోలేదు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌మ‌తో తెగ తెంపులు చేసుకున్న త‌ర్వాత ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దంటే వేయొద్దంటూ బాబు బ్యాచ్ తెగ ప్ర‌చారం చేసిన త‌ర్వాత కూడా త‌మ పార్టీ గెల‌వ‌టంపై బీజేపీ నేత‌ల ఆనందంగా అంతా ఇంతా  కాదు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతున్న వేళ‌.. టీడీపీ నేత‌లు చేస్తున్న బీజేపీ వ్య‌తిరేక ప్ర‌చారానికి ఒళ్లు మండి.. ఎన్నిక‌లు అయ్యాక ఏపీ సీఎంకు చుక్క‌లు చూపిస్తామ‌ని హెచ్చ‌రించారు.

బీజేపీ నేత నోటి నుంచి ఈ వ్యాఖ్య సంచ‌ల‌నంగా మారింది. అయితే.. ఎంత‌లా క‌డుపు మండితే తాము అలాంటి వ్యాఖ్య చేస్తామ‌ని క‌మ‌ల‌నాథులు చెబుతున్నారు. ఏది ఏమైనా క‌ర్ణాట‌క‌లో క‌మ‌ల‌నాథులు గెలిచారు. ఇది ఏపీ ముఖ్య‌మంత్రికి షాకింగ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. తాను తీసుకున్న యాంటీ మోడీ స్టాండ్‌తో ఏపీలో విజ‌యాన్ని చేజిక్కించుకోవాల‌నుకున్న బాబుకు తాజా ప‌రిణామం ఒక ప‌ట్టాన మింగుడుప‌డ‌నిదిగామారింద‌ని చెప్పాలి.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల సంతోషంలోనూ బీజేపీ నేత‌లు బాబును గుర్తు తెచ్చుకుంటున్నారంటే.. ఏపీ సీఎంకు రానున్న రోజుల్లో ఎన్నెన్ని ఇబ్బందులు ఎదురు కానున్నాయ‌న్న‌ది ఇట్టే అర్థం కాక మాన‌దు. తాజాగా బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాం మాధ‌వ్ రియాక్ట్ అయ్యారు. క‌ర్ణాట‌క విజ‌యం మీద ఆయ‌న ట్వీట్ చేశారు. అది  కూడా ఎవ‌రికో తెలుసా? ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌న్నిన రాజ‌కీయ వ్యూహాల్ని.. కుట్ర‌ల్ని క‌న్న‌డ ప్ర‌జ‌లు ప‌టాపంచ‌లు చేశార‌న్నారు. బీజేపీకి ఓటు వేయొద్దంటూ ప్ర‌చారం చేశార‌ని.. అయిన‌ప్ప‌టికీ క‌ర్ణాట‌క‌లో బీజేపీ గెలిచింద‌న్నారు. బాబు మాట‌ల్ని తెలుగు వారు న‌మ్మ‌లేద‌ని వ్యాఖ్యానించారు. వారంతా బాబు చెప్పిన మాట‌ను తిర‌స్క‌రించార‌ని.. అందుకు నిద‌ర్శ‌నంగా తెలుగు ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉన్న హైద‌రాబాద్ - క‌ర్ణాట‌క ప్రాంతాల్లో బీజేపీకి గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే 6 నుంచి 20కి పైగా సీట్లు పెరిగిన‌ట్లు వెల్ల‌డించారు.

సౌత్ లో త‌మ విజ‌య దుందుబి మొద‌లైన‌ట్లుగా ట్వీట్ చేశారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల విజ‌యంపై బీజేపీ నేత‌లు ప‌లువురు రియాక్ట్ అవుతున్నారు. తెలుగు ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ.. క‌ర్ణాట‌క రాష్ట్రంలో త‌మ పార్టీ ఎలా ప‌ని చేసిందో తెలుగు రాష్ట్రాల్లోనూ అలానే ముందుకు సాగ‌నున్న‌ట్లుగా చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఇక‌.. పురంధేశ్వ‌రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సిద్ధ‌రామ‌య్య‌.. మ‌హిళా వ్య‌తిరేక విధానాల్ని ప్ర‌జ‌లు తిర‌స్క‌రించిన‌ట్లుగా పురంధేశ్వ‌రి పేర్కొన్నారు.


Tags:    

Similar News