జేసీ ఫ్యామిలి ఫ్యాకేజీకి ఆ పార్టీ రెడీ...!

Update: 2019-10-23 17:30 GMT
జేసీ దివాక‌ర్ రెడ్డి.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర‌లేద‌నుకుంటా.. రాజకీయాల్లో త‌న‌దైన రీతిలో వాగ్భాణాలు సంధిస్తూ.. సొంత పార్టీ అని కూడా చూడ‌కుండా ఉన్న‌ది ఉన్న‌ట్లు కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లుగామ మాట్లాడే నేత‌ల్లో జేసీ దివాక‌ర్‌ రెడ్డి ఒక‌రు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లోనే ఓ వెలుగు వెలిగిన నేత జేసీ. కాంగ్రెస్‌ లో త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించిన ఈ నేత త‌రువాత అనుకోని ప‌రిస్థితుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోవ‌డంతో కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి టీడీపీ పంచ‌న చేరారు. కాంగ్రెస్‌ లో ఉన్నా - టీడీపీలో చేరిన సంచ‌ల‌న రాజ‌కీయాలు చేయ‌డంలో ఎవ‌రైనా జేసీ త‌రువాతే. .అయితే ఇప్పుడు ఆయ‌న క‌ష్ట కాలంలో ఉన్నారు. అందుకే పార్టీ మారేందుకు సిద్ద‌మ‌య్యార‌నే టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్న మాట‌.

అయితే ఇప్పుడు జేసీ దివాక‌ర్‌ రెడ్డిని త‌మ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఫ్యాకేజీ కూడా మాట్లాడింద‌ట ఓ పార్టీ. అంతే కాదు ఫ్యామిలీ మొత్తం పార్టీలో చేరితే బంఫ‌రాఫ‌ర్ కూడా ప్ర‌క‌టించింద‌ట ఆ పార్టీ.  అయితే ఆపార్టీలో చేరాలా వ‌ద్దా.. అని ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట జేసీ దివాక‌ర్ & ఫ్యామిలీ. అనంత‌పురం - క‌డ‌ప ప్రాంతాల్లో ప్రాబ‌ల్యం ఉన్న నేత జేసీ దివాక‌ర్‌ రెడ్డి. ఆయ‌న రాజ‌కీయంగా దాదాపుగా అన్ని ప‌ద‌వులు అనుభ‌వించారు. ఆయన త‌మ్ముడు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి. ఆయ‌న కూడా రాజ‌కీయంగా పాపులారిటీ ఉన్న వ్య‌క్తే. జేసీ బ్ర‌ద‌ర్స్‌ తో పాటు ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన జేసీ బ్ర‌ద‌ర్స్ వార‌సులు ఆస్మిత్‌ రెడ్డి - ప‌వ‌న్‌ రెడ్డి.

సంచ‌ల‌నాల జేసీని త‌మ పార్టీలో చేర్చుకోవాల‌న్న ప్లాన్‌లోల బీజేపీ అధినాయ‌క‌త్వం ఉంది. ఆయ‌న‌ను ఎలాగైనా త‌న పార్టీలోకి తెచ్చుకుంటే ఫైర్‌ బ్రాండ్‌ గా ప‌నిచేస్తార‌ని ఆ పార్టీ భావ‌న‌ట‌. అందుకే ఎలాగైనా పార్టీలోకి తీసుకుని మంచి ప‌ద‌వులు ఇస్తామ‌ని ఆశ చూపుతోంద‌ట‌. ఎందుకో ఆపార్టీలో చేరేందుకు మ‌న‌స్సు రావ‌డం లేద‌ట జేసీ దివాక‌ర్‌ రెడ్డి & ఫ్యామిలీకి.. జేసీ దివాక‌ర్‌ రెడ్డిని క‌మ‌లం పార్టీ నేత‌లు ఆహ్వానిస్తున్న‌ట్టు తెలుస్తోంది. క‌డ‌ప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి బీజేపీలో చేరిక‌తో జ‌మ్ములమ‌డుగు - ప్రొద్దుటూరు - మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ బ‌ల‌ప‌డింద‌నే ఆశ‌తో ఉండి ఇప్పుడు అనంత‌పురంలో బ‌లం సంపాదించుకోవాల‌ని క‌మ‌లం క‌స‌ర‌త్తు చేస్తుంద‌ట‌.

అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ద్వారా బీజేపీ అధిష్టానం రాయ‌భారం నెరుపుతున్న‌ట్లు సంకేతాలు వ‌స్తున్నాయి.. అయితే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ - జేసీ దివాక‌ర్‌ రెడ్డి ఇద్ద‌రు కాంగ్రెస్‌ లో క‌లిసి కాపురం చేసిన‌వారే. ఇద్ద‌రు స్నేహితులే. రాష్ట్రం విభ‌జ‌న కావ‌డంతో జేసీ టీడీపీకి - క‌న్నా క‌మ‌లం పార్టీలోకి చేరిపోయారు. అయితే ఇప్పుడు అదే స్నేహంతో క‌మ‌లం వైపు రావాల‌ని జేసీని క‌న్నా కోరుతున్నార‌ట‌. అంతే కాదు క‌మ‌లం పార్టీలో చేరితే రాజకీయ ప్రాధాన్య‌త ప‌ద‌వులు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేశార‌ట‌.

ఫ్యామిలీ మొత్తం బీజేపీలో చేరితే అనంత‌లో బీజేపీకి తిరుగుండ‌ద‌ని క‌మ‌లం పార్టీ నేత‌ల ఆశ‌. కానీ జేసీ మాత్రం త‌న కుల‌పోడు.. ఏదైనా ఆయ‌నే మొగోడు... మావాడు చెప్పాడంటే ఇక అంతే.. చేశాడంటే తిరుగుండ‌దు.. అని ఏపీ సీఎం జ‌గ‌న్‌ ను జేసీ పొగుడుతున్నాడు.. ఆయ‌న‌తో పాటు ఆ ఫ్యామిలీ వార‌సుల ప్రాణం వైసీపీ వైపు గుంజుతుంది.. క‌మ‌లం నేత‌లు ఆశ పెట్టి గుంజుతున్నారు. ఈ ఇద్ద‌రి గుంజాట‌లో ఏ ద‌రికి చేరాలో ఆలోచ‌న‌లో ప‌డింద‌ట జేసీ కుటుంబం.. మ‌రి క‌మ‌లం గూటిలోకి వెళతారా.. లేక ఫ్యాన్ గాలి కింద‌ సేద తీరుతారో వేచి చూడాల్సిందే ?


Tags:    

Similar News