చిరును లాగే పనిలో బీజేపీ ఫుల్ బిజీ?

Update: 2019-08-03 07:16 GMT
సాధారణంగా ఎన్నికలు ముగిసిన తర్వాత కనీసం రెండేళ్లు రాజకీయంగా స్తబ్దు వాతావరణం నెలకొని ఉంటుంది. అధికారపక్షం కార్యకలాపాలు తప్పించి.. ప్రతిపక్షంగా అన్ని చూస్తుండిపోవటం తప్పించి.. పెద్దగా రియాక్ట్ కాకుండా ఉండిపోతుంది. ఐదేళ్లకు ప్రజలు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో తొందరపాటుతో ప్రభుత్వం మీద విమర్శలు సంధించటాన్ని ప్రజలు సైతం స్వాగతించరు. అందుకే.. విపక్షాలు మౌనంగా ఉంటాయి.

ఇందుకు భిన్నమైన పరిస్థితి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొందని చెప్పాలి. బీజేపీ మాంచి ఊపు మీద ఉండటం.. ఏదోలా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలన్న ఆలోచనలో ఉన్న మోడీషాలు.. అందుకు తగ్గట్లు పావులు కదిపేందుకు పచ్చజెండా ఊపేయటంతో బీజేపీ నేతలు చెలరేగిపోతున్నారు. పార్టీలోకి వలసల్ని ప్రోత్సహించటం ద్వారా బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పలువురు నేతలు బీజేపీలోకి చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడలా వినిపిస్తున్న పేర్లలో చిరంజీవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009 ఎన్నికల బరిలో దిగిన చిరు.. తన ప్రభావాన్ని పెద్దగా చూపించలేకపోయారు. తర్వాతి కాలంలో కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవటంతో పాటు.. కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన రాజకీయాల మీద ఆసక్తిని తగ్గించుకున్నారు. తర్వాతి కాలంలో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండటమే కాదు.. 2014 ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారానికి సైతం దూరంగా ఉండిపోయారు.

రాజకీయాల మీద తనకు ఇంట్రస్ట్ లేదన్నట్లుగా ఉన్న చిరంజీవి.. తాజాగా బీజేపీ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యారావు మాట్లాడుతూ.. చిరంజీవి పార్టీలోకి వస్తే వెల్ కం చెబుతామని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.  బీజేపీలోకి చేరటం ద్వారా చిరుకు చక్కటి అవకాశం లభించటంతో పాటు.. ఆయనకున్న క్రౌడ్ ఫుల్లింగ్ ఛరిష్మాతో పార్టీకి అదనపు బలంగా మారుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇందుకు చిరు ఎంతవరకూ సిద్ధమన్నది ఒక ప్రశ్న. రాజకీయంగా ఫెయిల్ అయ్యారన్న పేరున్న చిరు.. బీజేపీలోకి చేరే సాహసం చేస్తారా?.. ఒకవేళ చేరినా అందుకు ఏపీ ప్రజలు సానుకూలంగా స్పందిస్తారా? అన్నది ప్రశ్నే.
Tags:    

Similar News