‘మోదీనే తిడతావా..? నీ అంతు చూస్తాం’

Update: 2018-05-16 15:56 GMT
ప్రత్యేక హోదా కోసం గళం వినిపిస్తున్న సినీ హీరో శివాజీతో ఏపీ బీజేపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయంలో ఆయన్ను వారు అడ్డుకుని దుర్భాషలాడడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మోదీనే విమర్శిస్తావా అంటూ ఆయన్ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడమే కాకుండా తమ నోళ్లకు పనిచెప్పారు. పోలీసులు కలగజేసుకుని ఆయన్ను సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు. అయితే.. తానేమీ ఇలాంటి బెదిరింపులకు భయపడబోనని శివాజీ అనంతరం చెప్పారు.

    ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  దిల్లీ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రావడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు విమనాశ్రయానికి వెళ్లారు.  అదే సమయంలో సినీ నటుడు శివాజీ హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్నారు. ఆయనను చూసిన బీజేపీ శ్రేణులు ఆయన్ను చుట్టుముట్టారు. తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే విమర్శలు చేస్తావా? అంటూ శివాజీని అడ్డుకుని, ఆయనను ముందుకు కదలనివ్వలేదు. తీవ్ర వాగ్వివాదం చెలరేగుతుండడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు శివాజీని పోలీసులు కారు ఎక్కించి పంపారు.  

    శివాజీ మాత్రం తానేమీ ఇలాంటివాటికి బెదిరిపోనని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు మోదీ, బీజేపీని ఇలాగే విమర్శిస్తానని ఆయన అంటున్నారు. బీజేపీలో కొద్దిమంది నేతలు తనతో చాలామంచిగా ఉంటారని.. కానీ, ఇప్పుడు తనను అడ్డుకున్నవారంతా పెయిడ్ ఆర్టిస్టులని ఆయన అన్నారు. కొత్త అధ్యక్షుడి రాకనేపథ్యంలో బలప్రదర్శన కోసం బీజేపీ నేతలు తెచ్చిన పెయిడ్ ఆర్టిస్టులే ఇదంతా చేశారని ఆయన ఆరోపించారు. తనపై దాడికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరి ముఖం తనకు గుర్తుందని, వారిపై చర్యలు తీసుకుంటానని అన్నారు.
Tags:    

Similar News