బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు రిలీజ్ !

Update: 2020-09-25 13:30 GMT
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు కొద్దిసేపటి క్రితం విడుదల అయింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా ఈ ఎన్నికల షెడ్యూల్ వివరాలు వెల్లడించారు.  బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత బిహార్‌ అసెంబ్లీ గడువు నవంబర్‌ 29తో ముగియనుంది. దేశంలో కరోనా విజృంభణ అనంతరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఈసీ ప్రత్యేక మార్గదర్శకాల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బహిరంగ సభలు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించింది. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌ లైన్ ‌లోనూ నమోదు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది.

మొదటి విడతలో 16 జిల్లాల పరిధిలోని 71 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇందుకోసం 31 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. రెండో విడతలో 17 జిల్లాల పరిధిలోని 94 శాసన సభా స్థానాలకు అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, నవంబర్ మూడవ తేదీన పోలింగ్ జరుపుతామని, ఇందుకోసం 42 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. మూడు విడతలో 15 జిల్లాల పరిధిలోని 78 సీట్ల ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి.. నవంబర్ 7వ తేదీన 33 వేల 50 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహిస్తామని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. నవంబర్ 10వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో వెయ్యి మంది ఓటర్లను అనుమతిస్తామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు ఉంచుతామని చెప్పారు.

బీహార్‌లో మొత్తం 7.29 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, కరోనా నిబంధనల మేరకు బీహార్‌లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కరోనా జాగ్రత్తలు విధిగా పాటించాల్సిందేనని తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వారికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ ఓటరుకు డిస్పోజబుల్ హ్యాండ్ గ్లోవ్స్ ఇవ్వాలని, తద్వారా ఈవీఎం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా వుంటుందని ఈసీ తలపెట్టింది. ఫేస్ మాస్కులు, హ్యాండ్ గ్లోవ్స్, పీపీఈ కిట్స్, శానిటైజర్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని సీఈసీ ఆదేశించింది. కరోనా వైరస్ జాగ్రత్తలపై అన్ని రకాల మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహించడం ద్వారా ఓటర్లను మోటివేట్ చేసి, పెద్దఎత్తున ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపారు. ప్రత్యేక మోనిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నికల అక్రమాలను నియంత్రిస్తామని ఆయన చెప్పారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని 15 రాష్ట్రాల్లో 64 స్థానాలకు ఉప ఎన్నికలకు సైతం షెడ్యూల్‌ను ప్రకటించింది. 
Tags:    

Similar News