టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్!

Update: 2020-01-12 10:27 GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నారని తేలడం.. వారంతా పోలీసుల విచారణకు హాజరు కావడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అయితే 2017లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ జరిగిన ఈ కేసులో హైదరాబాద్ లో ప్రధానంగా డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అతడి ఫోన్ లో 62మంది సినీ ప్రముఖల నంబర్లు ఉండడంతో విచారణ జరిపారు.

కెల్విన్ చెప్పిన లిస్ట్ ప్రకారం 11 మంది సినీ స్టార్లను పోలీసులు అప్పట్లో విచారించడం టాలీవుడ్ ను కుదిపేసింది. దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోలు రవితేజ,నవదీప్, తరుణ్, తనీష్,  నందు, సుబ్బరాజు, శ్యామ్ కే నాయుడు, చిన్నా, చార్మి, ముమైత్ ఖాన్ లు నోటీసులు అందుకొని విచారణకు హాజరయ్యారు.  ఈ కేసులో ఎవ్వరినీ వదిలిపెట్టమని అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ముందుకెళ్లింది. అయితే అనూహ్యంగా ఈ కేసు తర్వాత నీరుగారిపోయింది. అసలు ఈ కేసు పరిస్థితి ఏంటని తాజాగా సమాచారహక్కు చట్టం ద్వారా ఆరాతీయగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచారహక్కు చట్టం ద్వారా ఈ కేసు విషయాలను సేకరించారు. ఇందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

ఈ కేసులో 12 కేసులు పెట్టి మొత్తం 62మందిని విచారించినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సినీ ప్రముఖులను విచారించి వారి నుంచి రక్తం, గోర్లు, వెంట్రుకలు సేకరించామని వివరించారు. అయితే ఈ కేసులో నిందితులుగా సినీ ప్రముఖులను చేర్చలేదు. వారిని బాధితులుగా చూపించి కేసునుంచి తప్పించినట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి వివరాలు వెల్లడించారు. దీంతో ఈ కేసును నీరుగార్చారని ఆయన ఆరోపించారు. దీనిపై తెలంగాణ సీఎస్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.


Tags:    

Similar News