ఇన్ స్టాగ్రామ్ సెల‌బ్రిటీ గొంతు కోసి చంపి.. అలా చేశాడు!

Update: 2019-07-17 06:13 GMT
మ‌నిషి మ‌రీ ఇంత వికృతమైన ఆలోచ‌న‌ల‌తో ఉంటాడా?  తాను ప్రేమిస్తున్న అమ్మాయి గొంతు కోసి చంపేయ‌టం.. ఎలాంటి ప‌శ్చాతాపం లేకుండా.. హ‌త్య అనంత‌రం సెల్ఫీలు దిగి.. దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన వైనం చూస్తే.. అత‌డెంత ఉన్మాదంగా ఉన్నాడో ఇట్టే అర్థం కాక మాన‌దు. సంచ‌ల‌నంగా మారిన ఈ ఉదంతంలో బాధితురాలు ఎవ‌రో కాదు ఇన్ స్ట్రాగ్రాం సెల‌బ్రిటీగా పేరున్న 17 ఏళ్ల బియాంక డెవిన్స్.

ఆమెను అత్యంత పాశ‌వికంగా చంపిన వ్య‌క్తి.. న్యూయార్క్ లోని సిసిరో ప్రాంతానికి చెందిన  21 ఏళ్ల బ్రాండ‌న్ ఆండ్రీవ్ క్లార్క్. తాను ప్రేమిస్తున్న బియాంక‌ను క‌త్తితో గొంతు కోసి చంపేసిన క్లార్క్.. అనంత‌రం అచేత‌నంగా ప‌డి ఉన్న ఆమె ప‌క్క‌న సెల్ఫీలు దిగుతుండ‌గా.. పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆమె హ‌త్య‌కు గురైన‌ట్లుగా స‌మాచారం అందుకున్న పోలీసులు.. ఘ‌ట‌నాస్థ‌లానికి వెళ్లే స‌రికి.. శ‌వంతో ఫోటోలు దిగుతూ.. వాటిని ఇన్ స్ట్రాగ్రాంలో పోస్ట్ చేస్తున్న క్లార్క్ క‌నిపించాడు. అత‌డి త‌ల‌కు తుపాకి ఎక్కు పెట్టిన‌ప్పుడు కూడా తాను దిగిన దుర్మార్గ ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టం గ‌మ‌నార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి మ‌ర‌ణించిన బియాంక ఫోటోల్ని ఇన్ స్ట్రాగ్రామ్ తొల‌గించ‌కుండా ఉండ‌టంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ ఫోటోలు 12 గంట‌ల పాటు వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. దీంతో.. నెటిజ‌న్ల ఆగ్ర‌హావేశాల్ని వ్య‌క్తం చేశారు. దీంతో ఆల‌స్యంగా స్పందించిన ఇన్ స్ట్రాగ్రామ్ వాటిని  తొల‌గించింది.

ఇదిలా ఉంటే.. ఇంత ఉన్మాదంగా వ్య‌వ‌హ‌రించిన క్లార్క్ త‌ర‌చే డార్క్ వెబ్ సైట్ ను చూసేవాడ‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. ఇందులోని అశ్లీల వీడియోలు.. ఉగ్ర‌వాదుల వీడియోలు.. అత‌న్ని ప్ర‌భావితం చేసి ఉంటాయ‌ని భావిస్తున్నారు. అత‌డు చూసిన‌ట్లుగా చెబుతున్న  వెబ్‌సైట్ (అంద‌రి మంచి కోసం ఈ సైట్ వివ‌రాల్ని వెల్ల‌డించ‌టం లేదు) ను ఇప్ప‌టికే ప‌లుమార్లు తొల‌గించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చినా.. ఎప్ప‌టిక‌ప్పుడు ఆ సైట్‌ మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్న‌ట్లుగా వార్త‌లు రావ‌టం గ‌మ‌నార్హం.

ఇన్ స్టాగ్రామ్ లో సంచ‌ల‌నంగా మారిన ఈ హ‌త్య ఫోటోల్ని పోస్ట్ చేయ‌టానికి కార‌ణం సంచ‌ల‌నంగా మారేందుకే అన్న అభిప్రాయం ఉంది. హ‌త్యా నేరం నిరూపిత‌మైతే క్లార్క్ కు 25 ఏళ్లు జైలుశిక్ష ప‌డే అవ‌కాశం ఉంది. ఇలాంటోడ్ని జైల్లో పెట్టి పోషించే క‌న్నా.. ప్రాణాలు తీసేస్తే మంచిద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News