ఏపీ స‌ర్కారు గూగుల్‌ ను మూయిస్తుందా?

Update: 2017-04-21 11:36 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబునాయుడు - ఆయ‌న త‌న‌యుడు - ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ను ఉద్దేశిస్తూ ఫేస్‌ బుక్ పోస్టులు పెట్టిన సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ ర‌వికిర‌ణ్‌ ను అరెస్టుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. సోషల్‌ మీడియాలో విమర్శలు తట్టుకోలేక అణచివేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్‌ లో పప్పు అని టైప్ చేస్తే లోకేశ్‌ ఫొటో వస్తోందని, ఈ కార‌ణం చూపుతూ గూగుల్‌ ను చంద్రబాబు మూయించేస్తారా అని ప్రశ్నించారు. అలా మూయించేయ‌డం సాధ్య‌మ‌వుతుందా అని ఆలోచ‌న చేయ‌గ‌ల స‌మ‌ర్థ‌వంతులేన‌ని భూమ‌న ఎద్దేవా చేశారు.

సోషల్‌ మీడియా సాక్షిగా త‌ప్పుల‌ను ఎండ‌గ‌డితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం జీర్ణించుకోలేకపోతోందని, భావప్రకటన స్వేచ్ఛను హరించివేస్తోందని భూమ‌న ధ్వజమెత్తారు. ఫిఫ్త్ ఎస్టేట్‌ గా మారిన సోషల్ మీడియా అంటే చంద్రబాబు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల గొంతుకకు సంకెళ్లు వేస్తోందని భూమ‌న‌ మండిపడ్డారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు తగినరీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

సోషల్‌ మీడియాలో ఏపీ శాసనమండలిపై అసత్య ప్రచారం చేస్తున్న పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవికిరణ్‌ ను అరెస్ట్‌ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణ్‌ నాయక్ తెలిపారు. సీఎం చంద్రబాబు - ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ - మంత్రులను కించపరుస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని అసెంబ్లీ కార్యదర్శి సత్యన్నారాయణ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. తుళ్లూరు పోలీసులు ద‌ర్యాప్తును స్వీక‌రించిన అనంత‌రం ర‌వికిర‌ణ్‌ను అరెస్ట్ చేశారు.  చట్ట సభలను కించపరిస్తే ఎవరిపై నైనా చర్య తీసుకుంటామని అసెంబ్లీ కార్యదర్శి సత్యన్నారాయణ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News