అఖిలప్రియకు మంత్రి ఛాన్స్?

Update: 2017-03-13 07:03 GMT
సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ మంత్రి పదవిని చేపట్టాలన్న కోరికను తీర్చుకోలేకపోయారు టీడీపీ సీనియర్ నేత.. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి. గుండెనొప్పితో ఆయన హఠ్మానరణం చెందకుంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జరిపే ఏపీ మంత్రివర్గ విస్తరణలో భూమాకు అవకాశం తప్పనిసరిగా లభించి ఉండేది. అంతలోనే ఊహించని రీతిలో ఆయన ఆఖరి శ్వాస ఆగిపోయింది.

పార్టీతో దశాబ్దాల సంబంధం ఉన్న భూమా ఫ్యామిలీ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో పడిపోయింది. రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించటం.. అది జరిగి మూడేళ్ల వ్యవధిలోనే భూమా నాగిరెడ్డి ఆకస్మికమరణం నేపథ్యంలో.. ఆయనకు ఇవ్వాలని భావించిన మంత్రి పదవిని ఆయన కుమర్తె..ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

నిజానికి ఇప్పటికే భూమాకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చిన భూమాకు మంత్రి పదవిని ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా చెబుతారు. అయితే.. భూమాకు.. శిల్ప వర్గాలకు మధ్యనున్న పంచాయితీలను ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్ప చక్రపాణిరెడ్డికి అవకాశం ఇవ్వటం..భూమా వారికి సాయం చేయటం ద్వారా.. ఇరు వర్గాలను ఒకటి చేయాలన్నది బాబు ప్లాన్ గా చెబుతారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయ్యాక భూమాను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు అనుకున్నారని.. అంతలోనే తాజా విషాదం చోటు చేసుకుందని చెప్పాలి.
Read more!

సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్న భూమా.. తొలిసారి చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనంతరం ఆ  పార్టి కాంగ్రెస్ లో విలీనం చేసే క్రమంలో చిరుతో విభేదించిన ఆయన.. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పలు పరిణామాల నడుమ ఆయన.. టీడీపీలోకి మళ్లీ వచ్చేశారు. కర్నూలు జిల్లాలో జగన్ పార్టీ అధిక్యతస్పష్టంగా ఉండటం.. దానికి చెక్ చెప్పేందుకు భూమాను పార్టీలోకి తిరిగి తీసుకురావాలని భావించిన చంద్రబాబు..అందుకు సామదాన దండోపాయాల్నిప్రయోగించినట్లుగా చెబుతారు. కారణాలు ఏవైనా.. మొత్తానికి టీడీపీలోకి వచ్చిన భూమా.. తనకు మంత్రి పదవి పక్కా అనుకునేవారు.సన్నిహితుల దగ్గర మాత్రమే ఆయనీ మాటను ప్రస్తావించే వారని చెబుతారు. కానీ.. ఆయన కోరిక తీరకుండా వెళ్లిపోయిన నేపథ్యంలో.. ఆయనకు ఇవ్వాల్సిన మంత్రి పదవిని ఆయన కుమార్తె అఖిలప్రియకు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి కుమార్తెకు మంత్రి పదవి ఇవ్వటం తప్పనిసరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News