15 సీట్ల పేరుతో బండి సంజయ్ మరో సంచలనం

Update: 2022-08-02 05:32 GMT
నిజమా.. అబద్ధమా? అన్నది పక్కన పెడితే కొన్నిసందర్భాల్లో కొందరు నేతలు చేసే వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతుంటాయి. వారి మాటలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు తెర తీస్తుంటాయి.

తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రెండు.. మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా తాము నిర్వహించిన సర్వేలో ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 15 సీట్లు కూడా రావంటూ సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు మరీ అంత దయనీయంగా సీట్లు వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలురాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు తెర తీశారు. వాస్తవానికి ఇంత భారీ వ్యాఖ్య చేసినప్పుడు.. దానికి సంబంధించిన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

కానీ.. అలాంటిదేమీ ఇవ్వని బండి సంజయ్.. 15 సీట్లే టీఆర్ఎస్ కు వస్తాయని అదే పనిగా చెబుతున్నారు. ఈ రోజు నుంచి మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్నపాదయాత్ర నేపథ్యంలో ఒక రోజు ముందు మరోసారి మీడియాతో మాట్లాడారు బండి సంజయ్.

ఈ సందర్భంగా ఆయన మరోసారి తాను చెప్పిన15 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ కు వస్తాయన్న వాదనను వినిపించారు. కాకుంటే.. ఇందులో కొత్త విషయం ఏమంటే.. టీఆర్ఎస్ గెలుచుకునే 15 సీట్లలో కేసీఆర్ సీటు ఉండదంటూ కీలక వ్యాఖ్య చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎంకేసీఆర్ సైతం ఓటమిపాలు అవుతారన్నారు. పార్టీలోకి న్యాయబద్ధంగా.. చట్టబద్ధంగా వచ్చి చేరే వారు ఎవరైనా తాము చేర్చుకుంటామన్నారు.

కేసీఆర్ ను ఓడించటమే తన జీవిత లక్ష్యమన్న ఈటల రాజేందర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఆ వాదనకు బలం చేకూరేలా తాజాగా బండి సంజయ్ నోటి నుంచి వచ్చిన మాట ఆసక్తికరంగా మారింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే తన పని.. తన పార్టీ పనిగా పేర్కొన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News