టీడీపీ స్వ‌యంకృతం!..హోదా బోనులో బాల‌య్య‌!

Update: 2018-03-22 06:40 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదాకు సంబంధించి ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చోప‌చ‌ర్చ‌ల్లో అధికార టీడీపీ పిల్లిమొగ్గ‌లు వేస్తున్న వైనం చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. గ‌డ‌చిన నాలుగేళ్లుగా ఏపీకి ప్ర‌త్యేక హోదా అవ‌సరం లేద‌ని - కేంద్రం ఇస్తామ‌న్న ప్ర‌త్యేక ప్యాకేజీనే మేల‌ని డ‌బ్బా కొట్టి మ‌రీ ప్ర‌చారం చేసుకున్న టీడీపీ.. వైసీపీ కొట్టిన దెబ్బ‌కు తిరిగి ప్ర‌త్యేక హోదాను భుజానికెత్తుకోక త‌ప్ప‌లేదు. ఈ త‌ర‌హా వ్యూహం కార‌ణంగా టీడీపీ ప్ర‌భ‌ జ‌నాల్లో ప‌లుచ‌నైపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. మాట మార్చ‌డం చంద్ర‌బాబుకు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంద‌ని - ఆ మార్చిన మాట‌ను కూడా ప్ర‌చారం చేసుకునే దుర్మార్గం ఒక్క టీడీపీకి మాత్ర‌మే సాధ్య‌మ‌ని కూడా జ‌నాలు ఇప్పుడు బాగానే దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్ర‌మంలో మొన్న మీడియా ముందుకు వ‌చ్చిన టీడీపీ అధికార ప్ర‌తినిధి - ఆ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్ర‌సాద్‌... టాలీవుడ్ ను టార్గెట్ చేసుకుని జ‌నం దృష్టిని డైవ‌ర్ట్ చేసేందుకు య‌త్నించారు. అయితే రాజేంద్ర ప్ర‌సాద్ టాలీవుడ్‌ పై విసిరిన రాయి.... అటు తిరిగి ఇటు తిరిగి చివ‌ర‌కు ఆయ‌న‌కే త‌గిలింది. అంత‌టితో ఆగ‌ని ఆ రాయి... వైవీబీని గ‌ట్టి దెబ్బ కొట్టేసి - టాలీవుడ్ టాప్ హీరో - హింద‌పూరం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు బావ‌మ‌రిది నంద‌మూరి బాల‌కృష్ణ‌ను కూడా తాకేసింది. మొత్తంగా వైవీబీ నేల విడిచి చేసిన సాము... బాల‌య్య‌ను బ‌హిరంగ కోర్టులో నిల‌బెట్టింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

అయినా వైవీబీ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో బాల‌య్య‌ను టార్గెట్ చేసిన వారు ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే.. ఇంకెవ‌రు?  నిత్యం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై త‌న‌దైన శైలి ఆరోప‌ణ‌లు సంధిస్తున్న సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేశే. క‌త్తి మ‌హేశ్ కంటే ముందుగానే వైవీబీ వ్యాఖ్యాల‌పై స్పందించిన టాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌... బాల‌య్య పేరును నేరుగా ప్ర‌స్తావించ‌కున్నా కూడా టీడీపీకి దిమ్మ తిరిగే సెటైర్లే వేశారు. ఇక బాల‌య్య విష‌యానికి వ‌స్తే... క‌త్తి మ‌హేశ్ వైవీబీ వ్యాఖ్య‌ల‌కు స‌మాధానం చెప్పేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చి బాల‌య్య‌ను టార్గెట్ చేశారు. *ఏపీకి ప్ర‌త్యేక హోదాపై సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన చాలా మంది స్పందించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ - నిఖిల్ - త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌ - కొర‌టాల శివ త‌దిత‌రులంతా హోదా కోసం గ‌ళ‌మెత్తారు.  కాబ‌ట్టి ఈ విష‌యంలో సినీ ప‌రిశ్ర‌మ‌ను నిందించ‌డం త‌గ‌దు. అయినా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సీనియ‌ర్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌త్యేక హోదాపై ఎందుకు స్పందించ‌డం లేదు?  టీడీపీ పాల‌న‌లో నంది అవార్డులు ద‌క్కించుకున్న వారంతా ఏమ‌య్యారు? ఎక్క‌డికెళ్లారు?  నాభి చుట్టుతానే దృష్టి సారించే ఆ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఎక్క‌డికెళ్లాడు?  బోయ‌పాటి శీను ఒక్క మాటా మాట్లాడ‌రే?* అంటూ క‌త్తి మ‌హేశ్ త‌న‌దైన శైలిలో వైవీబీ కామెంట్ల‌పై ఫైరైపోయారు. మొత్తంగా వైవీబీ కామెంట్ల‌నే ఆధారం చేసుకుని టీడీపీకి అనుకూలంగా ఉంటార‌ని భావిస్తున్ని సినీ పెద్ద‌ల‌తో పాటు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు స్వ‌యానా బావ‌మ‌రిది అయిన బాల‌య్య‌పై క‌త్తి మ‌హేశ్ త‌న‌దైన శైలి సెటైర్లు వేశారు. అంటే బాల‌య్య‌ను వైవీబీనే దోషిగా నిల‌బెట్టార‌న్న మాట‌.

ఇదిలా ఉంటే... క‌త్తి మ‌హేశ్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో గ‌తంలో అప్పుడెప్పుడో వెల‌గ‌పూడి అసెంబ్లీకి తొలిసారిగా వ‌చ్చిన సంద‌ర్భంగా బాల‌య్య ప్ర‌త్యేక హోదాపై మాట్లాడిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించి వీడియో ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. బీజేపీ ఎమ్మెల్యేగానే కాకుండా నాడు చంద్ర‌బాబు కేబినెట్ లో వైద్య‌ - ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కామినేని శ్రీ‌నివాస్ తో క‌లిసి మీడియాతో మాట్లాడిన బాల‌య్య‌... ప్ర‌త్యేక హోదా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలపై త‌న‌కు ఏమాత్రం అవ‌గాహ‌న లేద‌ని తేల్చి పారేశారు. అయినా ప్ర‌త్యేక హోదా ఇస్తార‌నే తాను అనుకుంటున్నాన‌ని, అయినా ప్ర‌త్యేక హోదాను ప్ర‌క‌టించేసి ఆ త‌ర్వాత కేంద్రం చేతులు ముడుచుకుంటే ప‌రిస్థితి ఏమిటన్న కోణంలో ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసిన బాల‌య్య‌... ప్ర‌త్యేక ప్యాకేజీ కింద నిధులిచ్చినా స‌రిపోతుంద‌ని రీతిలో కామెంట్ చేశారు. మొత్తంగా హోదా అయినా, ప్యాకేజీ అయినా రాష్ట్రానికి న్యాయం జ‌ర‌గ‌డ‌మే ముఖ్య‌మ‌న్న కోణంలో ఆయ‌న వ్యాఖ్యానించారు. మొత్తంగా నాడు హోదాపై ఏమాత్రం అవ‌గాహ‌న లేకుండానే బాల‌య్య వ్యాఖ్యానించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వైవీబీ కామెంట్ల ఫ‌లితంగా ఇప్పుడు ఆ వీడియో మ‌ళ్లీ యూట్యూబ్‌ లో వైర‌ల్ గా మారిపోయింది.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News