బాలయ్య చిన్నల్లుడి మాట..క్రాస్ ఓటింగే దెబ్బేసిందట

Update: 2019-06-14 17:06 GMT
తాజా ఎన్నికల్లో 37 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ... తన చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఘోరంగా ఓడిపోయింది. 175 అసెంబ్లీ - 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ... 23 అసెంబ్లీ - మూడు ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుని అత్యంత ఘోర ఓటమిని చవిచూసింది. ఇంత భారీ ఎత్తున దెబ్బ తగులుతుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఓడినా ఓ మోస్తరు సీట్లు దక్కుతాయని చాలా మంది అనుకున్నా... ఎవరికి అధికారం దక్కినా మెజారిటీకి ఓ పది సీట్లు అటో - ఇటో వస్తాయని అంతా అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ... వైసీపీ 151 అసెంబ్లీ - 22 ఎంపీ సీట్లలో విజయకేతనం ఎగురవేసింది.

ఈ దెబ్బకు టీడీపీ నేతల నోట మాట రావడం లేదు. ఇంతమేర ఘోర పరాభవానికి గల కారణాలేమిటో ఇప్పటికీ తెలియడం లేదని సాక్షాత్తు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఇలాంటి వేళ... సినీ నటుడు - హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్.. టీడీపీ ఓటమికి గల కారణాలను చెప్పేందుకు బయటకు వచ్చారు. ఎన్నికల్లో తన తాత రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తానని బరిలోకి దిగిన శ్రీ భరత్... విశాఖ లోక్ సభ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓడిన టీడీపీ నేతల మాదిరే శ్రీభరత్ కూడా వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు.
Read more!

ఓడిన నాటి నుంచి అస్సలు బయటకు రాని శ్రీభరత్ శుక్రవారం ఎట్టకేలకు బయటకు వచ్చారు. మీడియాతోనూ మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమికి క్రాస్ ఓటింగే కారణమని ఆయన తేల్చేశారు. క్రాస్ ఓటింగ్ కారణంగానే తాము ఓడిపోయామని భావిస్తున్నానని చెప్పిన శ్రీ భరత్.. తమ ఓటమికి ఇంకేమైనా కారణాలున్నాయా? అన్న దిశగా విశ్లేషణ చేసుకుంటామని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో దక్కిన ఓటమితో గుణపాఠం నేర్చుకుంటామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే... ఆ పార్టీని తప్పనిసరిగా నిలదీస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News