నాకు సైకాలజీ తెలుసు: బాలయ్య హాట్‌ కామెంట్స్‌!

Update: 2023-01-27 12:00 GMT
ఇటీవల వీర నరసింహారెడ్డి సక్సెస్‌ మీట్‌ లో ఎస్వీఆర్, ఏఎన్నార్‌ లపై తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుండటంతో వాటిపై నందమూరి బాలకృష్ణ వివరణ ఇచ్చారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లు రెండు కళ్లలాంటివారని కొనియాడారు. ఎన్టీఆర్‌ తనకు తండ్రి అయితే..  ఏఎన్‌ఆర్‌ బాబాయ్‌ లాంటివారని తెలిపారు. బాబాయ్‌ పై ప్రేమ తన గుండెల్లో ఉంటుందని వ్యాఖ్యానించారు.

అక్కినేని నాగేశ్వరరావు అంటే చిన్నతనం నుంచీ తనకెంతో అభిమానమని తెలిపారు, ఆయనను తాను కించపరచలేదని స్పష్టం చేశారు. యాధృచ్ఛికంగా అన్న మాటలను వక్రీకరించారని చెప్పారు. తాడో పేడో అంటామని.. పేడో అంటే అర్థం ఏముంది? అని ప్రశ్నించారు. యాసతో అన్న మాటలకు దురర్థాలు తీయడం తగదని హితవు పలికారు.

 ఏఎన్‌ఆర్‌ కు తానంటే చాలా ఇష్టమని, ఆయన పిల్లల కంటే ఎక్కువగా తనను ఆప్యాయంగా చూసుకునేవారని చెప్పారు. తన తండ్రి నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానని.. అలాగే తన బాబాయి నాగేశ్వరరావు నుంచి పొగడ్తలకు దూరంగా ఎలా ఉండాలో నేర్చుకున్నానని వెల్లడించారు.

తనకు సైకాలజీ తెలుసని బాలయ్య చెప్పారు. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నందునే తానంటే అందరికీ భయమని వెల్లడించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని.. ఈ లోగా ఎన్నో కుట్రలు చేసే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం గలిబిపల్లిలో నందమూరి బాలకృష్ణ పర్యటించారు. రూ.35 లక్షల వ్యయంతో నిర్మించే బీటీ రహదారి పనులకు భూమిపూజ చేశారు. హిందూపురంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్రంలో వైకాపా తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలకు వలసలే దిక్కని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

 రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టి మూడున్నరేళ్లు గడిచినా అభివృద్ధి జాడ కనపడటం లేదని తెలిపారు. కేవలం ల్యాండ్, శాండ్, వైన్‌ అనే విధానాలు మాత్రమే కనిపిస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పి.. పన్నుల రూపంలో బాదుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.

రివర్స్‌ టెండర్‌ పేరుతో పోలవరం ఆగిపోయిందని గుర్తు చేశారు. యువత ఉపాధి లేక వలస పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. సీఎం జగన్‌ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఇస్తున్న భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని ప్రజలు బలపరచాలని కోరారు.

యువత భవిష్యత్తు కోసమే నారా లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానన్నారు. అప్పుడప్పుడూ పాదయాత్రలో లోకేశ్‌ను కలుస్తుంటానని తెలిపారు. యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News