వైసీపీ-బీఆర్ఎస్ మధ్య పెరుగుతున్న మైత్రి.. లేటెస్ట్ ఆప్టేడ్ ఏంటంటే..
ఏపీలో ఇంతవరకు రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తూ వచ్చాయి. బహిరంగంగా ఒకరి పార్టీ కార్యక్రమంలో కాని, ప్లెక్సీల్లో కాని మరో పార్టీ ప్రస్తావన, ఫొటోల ముద్రణ జరగలేదు.;
రెండు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలుగా ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ మధ్య స్నేహ బంధం రోజురోజు మరింత పెరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగిన నుంచి ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం కొనసాగుతుంది. ఇన్నాళ్లు ఒకస్థాయి వరకు ఉన్న ఈ సంబంధాలు ఇప్పుడు మరింత ధృడం అవుతున్నట్లే తాజా పరిణామాలు సూచిస్తున్నాయని అంటున్నారు. ఇటీవల తాడేపల్లిలోని ఏపీ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ఇంటి వద్ద ఆయన పుట్టిన సందర్భంగా జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో కూడిన ప్లెక్సీ ఏర్పాటు చేస్తే, బుధవారం ఖమ్మం జిల్లాలో మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇది వైసీపీ, బీఆర్ఎస్ మధ్య స్నేహం బలపడాలని కోరుకుంటున్న ఆయా పార్టీల కార్యకర్తల మనోగతాన్ని ప్రతిఫలిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల అభినందన సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వాహన కాన్వాయ్ లో బీఆర్ఎస్ జెండాలు కనిపించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. అంతేకాకుండా కొందరు కార్యకర్తలు కేటీఆర్ పర్యటనలో జై జగన్.. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇది గమనించిన వారు రెండు పార్టీల కార్యకర్తలు ఒకరి విజయాన్ని మరొకరు బలంగా కోరుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీలో ఇంతవరకు రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తూ వచ్చాయి. బహిరంగంగా ఒకరి పార్టీ కార్యక్రమంలో కాని, ప్లెక్సీల్లో కాని మరో పార్టీ ప్రస్తావన, ఫొటోల ముద్రణ జరగలేదు. కానీ, రెండు రాష్ట్రాల్లో రెండు విపక్ష పార్టీలు ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితుల మధ్య ఒకరికొకరు సహకరించుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. దీంతోనే తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని వైసీపీ కార్యకర్తలు.. ఏపీలో వైసీపీ అధికారం సాధించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇటీవల ఇచ్చిన ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూలోనూ వెల్లడించారు.
అదేవిధంగా కొద్దిరోజుల క్రితం మాజీ సీఎం జగన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఆ సమయంలో రెండు పార్టీల సోషల్ మీడియాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఇద్దరు నేతలు ఒకే ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ ఇచ్చిన స్టిల్ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు, పార్టీల మధ్య సంబంధాలు మరింత ధృడంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాన్ని ఆయా పార్టీల కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలో వైసీపీ జెండాలు కనిపించడంపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నాయకన్‍గూడెం దగ్గర కేటీఆర్‍కు వైసీపీ కార్యకర్తలు స్వాగతం పలికడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీల సాన్నిహిత్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రెండుపార్టీలు రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారం పొందాలని భావిస్తున్నాయి. అటు కేటీఆర్, ఇటు జగన్ కుటుంబాల్లోని పరిణామాలు కూడా ఒకే విధంగా కొనసాగుతున్నాయి. జగన్ చెల్లెలు షర్మిల, కేటీఆర్ చెల్లెలు కవిత కూడా తమ కుటుంబాలతో సంబంధాలు తెంచేసుకున్నారు. ఇద్దరు యువనేతల మధ్య పోలికలపై సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. రెండు పార్టీల నేతల మధ్య తాజా అనుబంధం కొత్త చర్చకు దారితీస్తోంది.