2026లొ లోకేశ్‌కు ప్రమోషన్.. వేణుస్వామి సంచలనం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహనరెడ్డి వ్యక్తిగత, రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.;

Update: 2026-01-08 19:30 GMT

ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన అంచనాలను వెల్లడించారు. 2026లో కొత్త కేలండర్ రావడంతో ఆయన పలువురు ప్రముఖుల జాతకాలపై తన విశ్లేషణ వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహనరెడ్డి వ్యక్తిగత, రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి నారా లోకేశ్‌కు పదోన్నతి లభించే అవకాశం ఉందని వేణుస్వామి జోస్యం చెప్పడం సంచలన చర్చకు తెరలేపింది.

తెలుగు రాష్ట్రాలలో పలువురు సెలబ్రెటిలు, రాజకీయ నాయకులు, పార్టీల జాతకాలపై వేణుస్వామి తరచూ జోస్యం చెబుతుంటారు. కొన్నిసార్లు ఆయన చెప్పినట్లే జరిగినా, కొన్ని మాత్రం తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో కొద్దికాలం క్రితం తాను రాజకీయాలకు సంబంధించిన జోస్యం భవిష్యత్తులో చెప్పనంటూ గతంలోనే స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఆ మాటను కాస్త సవరించుకుని ఎన్నికల్లో గెలుపు ఓటములపైనే తాను అంచనాలు చెప్పనని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలంగా ఉన్న నేతల జాతకాలపై తన జోస్యం వెల్లడించారు.

ప్రధానంగా ఏపీలో యువనేత నారా లోకేశ్‌కు పదోన్నతిపై వేణుస్వామి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. 2026లో లోకేశ్, పవన్, జగన్ జాతకాలు అద్భుతంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇక వేణుస్వామి జోస్యం ప్రకారం మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం ఉన్న హోదా నుంచి మరో మెట్టు ఎక్కనున్నారట. అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెబుతున్నారు వేణుస్వామి. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 2029 వరకు సీఎం అయ్యే అవకాశాలు లేవని తేల్చిచెప్పారు.

పవన్ జాతకం ఈ ఏడాది బాగానే ఉందని వేణుస్వామి వెల్లడించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రపతి అవుతారనే ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, ఆయన జాతకం ప్రకారం ఆ అవకాశాలు లేవని తేల్చిచెప్పారు. కానీ, ఆయన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కర్కాటక రాశికి చెందిన వారని, ఇద్దరి జాతకాల ప్రకారం ఈ ఏడాది ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వేణుస్వామి తన అంచనా వెలువరించారు. చంద్రబాబు కష్టపడాల్సింది ఏమీ లేదని, 2026 చక్కగా నడుస్తుందని పేర్కొన్నారు.

కేటీఆర్, పవన్ కళ్యాణ్‌లది మకర రాశి. పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏపీలో కూటమి పార్టీల్లో ఎలాంటి సమస్యలు రావు. 2026లో ఎలాంటి ఇబ్బందులు లేవు. 2027లో సంచలనాలు ఉంటాయని అంచనా వేస్తున్నాను. 2029 వరకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు.. ఆ తర్వాత చూద్దాం. ఆ తర్వాత జాతకాలు మారిపోతాయి' అన్నారు. 2027, 2028, 2029లో ఎలా ఉంటుంది ముందే చెప్పలేను. అప్పటి జాతకాలు, పంచాంగం, వ్యక్తిగత విషయాలను విశ్లేషించి చెప్పగలను. క్రికెట్, ఎన్నికల ఫలితాలు, ప్రెగ్‌నెన్సీ గురించి ఇక మీదట జాతకాలు చెప్పను, మాట్లాడబోను. ఈ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందని నేను చెప్పదలచుకోలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు 2026లో పాజిటివ్‌గా ఉంటుంది. ఆయనది మిధున రాశి.. ఆయనకు పాజిటివ్‌గానే ఉంది. ఆయన వెళితే జనాలు రోడ్డు మీదకు వస్తున్నారు.. ఆయనకు అదే కావాలి. 2026లో పెద్దగా మార్పులేవీ ఉండవు' అని వేణుస్వామి చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News