దమ్ముంటే రండి...ధర్మవర మాజీ ఎమ్మెల్యేకు తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ వార్నింగ్!
కృష్ణా నదికి వచ్చే నీళ్లు తక్కువ, అవసరాలు ఎక్కువ'.. ఇదే తెలుగు రాష్ట్రాలు చెబుతున్నది. ఆ నీళ్ల వాటాకోసం తగువులాడుకుంటున్నాయి రాష్ట్రాలు.;
తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తమదైన స్టైల్ లో రెచ్చిపోయారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదం పై చేసిన వ్యాఖ్య ఇపుడు సీమ పౌరుషాన్నే టచ్ చేసింది. తాజాగా రాయలసీమ గురించి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన కామెంట్లు ఇపుడు కాక పుట్టిస్తున్నాయి. మూడేళ్ళు తర్వాత దాకా ఎందుకు దమ్ముంటే ఇప్పుడే రండి నా...అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ గా హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తాజాగా... మనమంతా కారం గట్టిగా తింటూ పౌరుషం అంటూ మాట్లాడుకుంటున్నాం అంతే.. మనకి పౌరుషం లేదు అనడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి విరుచుకు పడ్డారు. కేతిరెడ్డిది అంత షో ఆఫ్ అన్నారు. రాయలసీమకు పౌరుషం లేదంటే కేతిరెడ్డిని రాయలసీమ ప్రజలు కొడతారని ఘాటుగా బదులిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఒత్తిడి తీసుకు రావడం వల్లే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపివేశారంటూ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేకెత్తించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించినా...ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీ నేతలు ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ఇందుకు దీటుగా కూటమి నేతలు మాట్లాడుతూ...గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సరైన అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పనులు హడావుడిగా చేపట్టిందని, రోజుకు 3టీఎంసీల నీళ్ళు తరలిస్తామని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రకటనల వల్లే తెలంగాణ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని అన్నారు. 2020లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ , కేంద్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనుల్ని నిలిపివేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వివరిస్తున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే...కేంద్రం ఈ పనుల్ని అడ్డుకుందని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలో వాస్తవం లేదని అన్నారు.
కాగా తెలంగాణ అసెంబ్లీలో తాజాగా కృష్ణా జలాలపై నీళ్లు - నిజాలపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు చేపడితే, తాను ఏపీ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి ఆ పనులను ఆపించానని సంచలనంగా వ్యాఖ్యానించడంతోనే ఈ విమర్శల హోరు మొదలైంది. చినికి చినికి వానగా మారినట్లు ...సీఎం రేవంత్ రెడ్డి అన్న ఒక్కమాటతో ఏపీలో రాజకీయ పార్టీలు పరస్సరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడారు.... ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నావ్.. రేయ్ పౌరుషం లేదా.. రా రా రాయలసీమ పౌరుషం ఏంటో చూపిస్తా. ధర్మవరంలో నువ్వు ఏం చేశావ్.. గుడ్ మార్నింగ్ అంటూ షో చేశావ్. కేతిరెడ్డి కుటుంబానికి పౌరుషం లేదు.. రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నారు.. పౌరుషం లేని మీరు రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం చంద్రబాబు దయా దక్ష్యాణ్యాల మీద వారంతా బతుకుతున్నారని జేసీ విమర్శించారు. బాబు మంచోడు కాబట్టి.. మేము ఏం మాట్లాడకుండా ఉన్నామని తెలిపారు. మీరు రప్పా రప్పా అంటున్నా.. చంద్రబాబు అభివృద్ధి కోసం తిరుగుతున్నారని వెల్లడించారు. రాయలసీమ ప్రాజెక్టులపై దమ్ముంటే చర్చకు రావాలని డిమాంచ్ చేశారు.
కృష్ణా నదికి వచ్చే నీళ్లు తక్కువ, అవసరాలు ఎక్కువ'.. ఇదే తెలుగు రాష్ట్రాలు చెబుతున్నది. ఆ నీళ్ల వాటాకోసం తగువులాడుకుంటున్నాయి రాష్ట్రాలు. ఈ ఇద్దరి కొట్లాటల మధ్య నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. అటుఇటుగా 650 టీఎంసీలు. ఒక్కోసారి వెయ్యి టీఎంసీల వరకు ఎవరికీ కాకుండా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. అసలు.. కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిన వాటానే 811 టీఎంసీలు. తాత్కాలికంగా తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చినా.. వాడుకుంటున్నది మాత్రం 116, 117 టీఎంసీలే. ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులున్నాయ్. గట్టిగా వాడినా 100 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతోంది ఏపీ. కృష్ణా నీటిని సమర్ధంగా వాడుకునే పరిస్థితే లేదంటే.. ఈ ప్రాజెక్టును నిలిపివేయండని తెలంగాణ నేతలు అంటున్నారు.
తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ...మాజీ మంత్రి రోజా వచ్చి మూడేళ్ల తర్వాత చూస్తా అంటుంది.. ఎప్పుడు వచ్చి సచ్చేది మీరు అని విమర్శించారు. రాయలసీమ ప్రజలు కేతిరెడ్డి కుటుంబాన్ని తంతారని హెచ్చరించారు.. నీ స్టైల్,నీ మాటలు మానుకో కేతిరెడ్డి అంటూ సలహా ఇచ్చారు. "మీకు సీమ పౌరుషం ఉంటే రెడీగా ఉండండి.. కారు కూతలు కూయొద్దు అని జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మొత్తమ్మీద జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై చేసిన రా కామెంట్లు ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకత్తిస్తోంది.