ఏపీలో కొత్త పథకం...వారికి ఎంతో ఉపయోగం
ఈ నేపథ్యంలో రాష్ట్ర బీసీ ఈడబ్య్లూఎస్ శాఖల మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. త్వరలో గరుడ పధకానికి శ్రీకారం చుడతామని చెప్పారు.;
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో కొత్త పధకానికి శ్రీకారం చుడుతోంది. దీనివలన ఒక కీలకమైన సామాజిక వర్గానికి ఎంతో ఊరట లభిస్తుంది అని అంటున్నారు. ఈ విషయం మీద ప్రస్తుతం అయిత కసరత్తు జరుగుతోంది. ఇంతకీ ఆ పధకం పేరు ఏమిటి అంటే గరుడ పధకం. ఇది గతంలో అంటే 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ హయాంలో ఉండేది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పధకాన్ని ఎత్తివేశారు. అంతే కాదు ఈ పధకం వల్ల లబ్ధి పొందుతున్న బ్రాహ్మణులకు కూడా నిరాశను కలిగించారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అనేక పధకాలు అందుతున్న నేపథ్యంలో దానిని సైతం పూర్తిగా ఉత్సవ విగ్రహంగా గత కాలంలో చేశారు అన్న విమర్శలు ఉన్నాయి.
మంత్రి కీలక ప్రకటన :
ఈ నేపథ్యంలో రాష్ట్ర బీసీ ఈడబ్య్లూఎస్ శాఖల మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. త్వరలో గరుడ పధకానికి శ్రీకారం చుడతామని చెప్పారు. ఈ పథకం ద్వారా ఏపీలోని పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. మృతి చెందిన పేద బ్రాహ్మణులకు పది వేల రూపాయల ఆర్థిక సాయం ఈ పధకం ద్వారా అందుతుందని ఆమె వెల్లడించారు. అంతే కాదు బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో ఏపీలోని బ్రాహ్మణులకు మంచి రోజులు వచ్చాయని ఆమె అన్నారు.
కార్యాచరణ రెడీ :
ఇక ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్లు మంత్రి వెల్లడించారు. బ్రాహ్మణులలో పేదరిక నిర్మూలనకు 2014 లోనే చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్నో పథకాలను అమలు చేస్తూ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా కల్పనకు అప్పట్లో సీఎం గా బాబు ఎంతో కృషి చేశారన్నారు. 2014-19 మధ్యలో బ్రాహ్మణులకు భారతి, భారతీ విదేశీ విద్య, గాయత్రి, వేదవ్యాస, వశిష్ట, ద్రోణాచార్య, చాణక్య, కల్యాణమస్తు, కశ్యప, గరుడ వంటి పది పథకాలను చంద్రబాబు ప్రభుత్వంలో అమలు చేశారన్నారు. దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల పథకాన్ని మొదట అమలు చేసిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జగన్ వచ్చిన తరవాత చంద్రబాబు అమలు చేసిన పథకాన్నింటినీ నిలిపేశారని మంత్రి విమర్శించారు.
బ్రాహ్మణుల కోసం :
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల కోసం పాత పథకాలతోపాటు కొత్త పథకాలూ అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి సవిత చెప్పుకొచ్చారు. స్వయం ఉపాధి కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీలో అర్చకులు గౌరవ వేతనం 7వేల రూపాయలకు ధూప దీపాల కోసం మూడు వేల రూపాయలు ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసిందని మంత్రి చెప్పారు. అదే విధంగా 50 వేలకు పైగా ఆదాయం వచ్చే ఆలయాలలో దేవస్థానాలలో పనిచేసే అర్చకులకు గౌరవ భృతిని 10 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయలకు పెంచామన్నారు. నిరుద్యోగ వేడ పండితులకు మూడు వేల నిరుద్యోగ భృతిని సంభావన పేరుతో అందజేస్తున్నామని మంత్రి వివరించారు.