సంపాదనే కాదు సంతానం విషయంలోనూ మస్క్ రొటీన్ కు భిన్నమే!
అవును.. మొత్తం 14 మంది పిల్లలకు తండ్రి అయిన ఎలాన్ మస్క్.. తన పిల్లలకు ప్రత్యేకమైన పేర్లు పెట్టడానికి ఇష్టపడతారనే చెప్పాలి.;
భూగ్రహంపై అత్యంత ధనవంతుడు, స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తన పిల్లల ప్రత్యేకమైన పేర్ల పట్ల ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఉత్సుకతను రేకెత్తించారు. ఈ సందర్భంగా... మస్క్ - శివోన్ జిలీస్ జంట తమ నాలుగేళ్ల కవలలు స్ట్రైడర్ శేఖర్, కామెట్ అజ్యూర్ పేర్లను ఎలా ఎంచుకున్నారనే విషయాన్ని ప్రపంచంతో పంచుకున్నారు. ఇందులో శేఖర్... భారతీయ శాస్త్రవేత్త పేరు కావడం గమనార్హం.
అవును.. మొత్తం 14 మంది పిల్లలకు తండ్రి అయిన ఎలాన్ మస్క్.. తన పిల్లలకు ప్రత్యేకమైన పేర్లు పెట్టడానికి ఇష్టపడతారనే చెప్పాలి. ఈ క్రమంలో తన నాలుగేళ్ల కవలల పేర్ల వెనుక ఉన్న కారణాన్ని, విశిష్టతను వెలడించారు. ఇందులో భాగంగా.. తన కుమారుడి పేరు 'స్ట్రైడర్ శేఖర్' అని చెప్పిన మస్క్.. ఇందులో 'స్ట్రైడర్' పేరు ప్రముఖ రచయిత జె.ఆర్.ఆర్. టోల్‌కీన్ రాసిన 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' కథలోని పాత్ర నుంచి తీసుకున్నదని చెప్పారు.
ఇక ఆ పేరులోని రెండో సంగం 'శేఖర్' పేరు.. భారతీయ-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ కు గౌరవంగా పెట్టినదని తెలిపారు. చంద్రశేఖర్ 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఇక తన కుమార్తె కామెట్ అజ్యూర్ పేరు విషయానికొస్తే.. అది 'ఎల్డెన్ రింగ్' అనే వీడియో గేమ్ లో అత్యంత శక్తివంతమైన మంత్రం పేరు నుంచి తీసుకున్నదని మస్క్ వెల్లడించారు.
ఇక భార్య శివోన్ జిలీస్ విషయానికొస్తే.. ఆమె తల్లి శారదా జిలిస్ ద్వారా భారతీయ మూలాలను కలిగి ఉంది. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ను సత్కరించడానికి మస్క్ తీసుకున్న నిర్ణయం ఆన్ లైన్ లో విస్తృతంగా ప్రశంసించబడింది.
కాగా.. ఎలాన్ మస్క్ కు జస్టిన్ విల్సన్ తో ఆరుగురు పిల్లలు, గ్రిమ్స్ తో ముగ్గురు, శివోన్ జిలీస్ తో నలుగురు పిల్లలు, ఆష్లే సెయింట్ క్లెయిర్ తో ఒక బిడ్డ కలిపి మొత్తం 14 మంది సంతానం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో.. ఎలాన్ మస్క్ సంపాదన విషయంలోనే కాదు.. సంతానం విషయంలోనూ రొటీన్ కు భిన్నమే అనే కామెంట్లు నెట్టింట వినిపిస్తుంటాయి!