రష్యాకు చెక్.. భారత్ కు వెనుజులా చమురు
వెనెజులా చమురు భారత్ కు అమ్మేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. దీనిని వైట్ హౌస్ వర్గాలు ధృవీకరించాయి.;
వెనెజులా చమురు భారత్ కు అమ్మేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. దీనిని వైట్ హౌస్ వర్గాలు ధృవీకరించాయి. వెనెజులా నుంచి అమెరికాకు దాదాపు 30-50 మిలియన్ బ్యారెళ్ల చమురు రానుంది. దీనిని ప్రపంచ దేశాలకు విక్రయించాలని అమెరికా ఆలోచిస్తోంది. ఈ మేరకు భారత్ కు కూడా విక్రయించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. వెనెజులా నుంచి వచ్చే చమురును మార్కెట్ ధరకు విక్రయిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆ డబ్బును అమెరికా, వెనెజులా ప్రయోజనార్థం తమ వద్ద ఉంచుకోనున్నట్టు ప్రకటించారు. చమురు నిల్వలను నౌకల ద్వారా సరఫరా చేసి ఓడరేవుల్లో నిల్వ చేయనున్నట్టు ట్రంప్ తెలిపారు.
భారత్ కొనుగోలు చేస్తుందా ?
ట్రంప్ వెనెజులా చమురు భారత్ కు అమ్మితే.. భారత్ కొనుగోలు చేస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే ఇప్పటికే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి కొనుగోలు చేయకుండా.. అమెరికా నుంచి కొనుగోలు చేస్తుందా అన్నది అసలు ప్రశ్న. ఇప్పటికే రష్యా నుంచి కొనుగోలు చేయొద్దంటూ అమెరికా చాలా కాలంగా ఒత్తిడి చేస్తోంది. టారిఫ్ లు కూడా విధించింది. మరో 500 శాతం టారిఫ్ విధిస్తారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా ఒత్తిడికి తలొగ్గి .. భారత్ చమురు కొనుగోలు చేస్తుందా ? . లేదంటే రష్యాతో ఉన్న ఒప్పందాన్ని యధావిధిగా కొనసాగిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.
రష్యాపై వ్యూహమా ?
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దన్నది అమెరికా వాదన. భారత్ ఆ వాదనను ఖాతరు చేయడంలేదు. దీంతో టారిఫ్ విధించారు. అయినా కూడా భారత్ తగ్గలేదు. అమెరికాకు ఉన్న అవసరాల నేపథ్యంతో మిగిలిన దేశాలతో పోల్చితే ట్రంప్ భారత్ విషయంలో కొంత పట్టువిడుపును ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే నేరుగా రష్యా చమురు కొనుగోలు చేయొద్దని చేసిన ఒత్తిడి పని చేయకపోవడంతో.. ఇటీవల వెనుజులా చమురు అమెరికా చేతికి రావడంతో .. రష్యా చమురు కాకుండా తమ చమురు కొనుగోలు చేయమని ఒత్తిడి చేస్తారా ?. ఒకవేళ అమెరికా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తే.. ఇక రష్యా చమురు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు అమెరికా అనుకున్నది సాధించినట్టవుతుంది. ఈ రకమైన వ్యూహంతోనే అమెరికా వెనుజులా చమురు భారత్ కు అమ్మే ప్రతిపాదన తీసుకొచ్చిందా అన్నది మరొక ప్రశ్న.
చైనాలో భయం
వెనుజులా చమురు అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేస్తే.. అమెరికా రష్యాకు చెక్ పెట్టినట్టే అవుతుంది. నేరుగా కాకపోయినా పరోక్షంగా అమెరికా అనుకున్నది సాధించినట్టవుతుంది. వెనుజులా చమురుతో అనేక ప్రయోజనాలు చేకూరేలా అమెరికా ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. వెనుజులా చమురు భారత్ కొనుగోలు చేస్తే.. రష్యాకు చెక్ పెట్టినట్టు అవుతుంది. అదే విధంగా వెనుజులాను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో చైనాకు చెక్ పెట్టారు. ఈ రెండు ప్రధాన దేశాలకు చెక్ పెడితే జియోపాలిటిక్స్ లో భారీ మార్పులు వస్తాయి. ఇప్పటికే చైనా వెనుజులా అంశంపై లీగల్ గా పోరాడాలని భావిస్తోంది. ఎందుకంటే చైనా వంద దేశాల్లో వివిధ రంగాల్లో తమ పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు వెనుజులాలో కొత్త ప్రభుత్వం రావడంతో చైనాతో ఉన్న పాత ఒప్పందాలు అమలు చేయాల్సిన పనిలేదు. దీని వల్ల చైనాకు వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. కానీ ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. చైనా పెట్టిన పెట్టుబడులు ప్రమాదంలో పడతాయి. వెనుజులాలో జరిగినది ఇంకో చోట పునరావృతం అవుతుంది. అందుకే అలా జరగకుండా చైనా లీగల్ పోరాటానికి దిగింది.