రైల్వే ట్రాక్‌పై లోకో పైలట్ కన్నీటి గాథ: అనారోగ్యంతో ఉన్నా తప్పని విధులు!

రాజేష్ మీనా అనే లోకో పైలట్ కొంతకాలంగా 'పైల్స్' (మొలలు) సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. రకరకాల మందులు వాడినా తగ్గకపోవడంతో, చివరికి ఫిబ్రవరి 22న లక్నోలో సర్జరీ చేయించుకున్నారు.;

Update: 2026-03-04 09:30 GMT

ఆఫీసుల్లో సెలవు కావాలంటే బాస్‌లకు నచ్చచెప్పడం కష్టమైన పనే. కానీ, ఒక వ్యక్తికి ఆపరేషన్ జరిగి, ఆ గాయం మానక నరకం అనుభవిస్తున్నా సరే సెలవు ఇవ్వనని మూర్ఖంగా వ్యవహరించడం అంటే అది కేవలం మొండితనం కాదు, క్రూరత్వండ కూడా. లక్నో రైల్వే డివిజన్‌లో రాజేష్ మీనా అనే లోకో పైలట్‌కు ఎదురైన అనుభవం వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. తన పరిస్థితిని నిరూపించుకోవడానికి ఆయన పడ్డ కష్టం, అవమానం ఇప్పుడు రైల్వే వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.

ఏం జరిగిందంటే?

రాజేష్ మీనా అనే లోకో పైలట్ కొంతకాలంగా 'పైల్స్' (మొలలు) సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. రకరకాల మందులు వాడినా తగ్గకపోవడంతో, చివరికి ఫిబ్రవరి 22న లక్నోలో సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ జరిగి వారం రోజులైనా గాయం మానలేదు, విపరీతమైన నొప్పి వస్తోంది. అలాంటి స్థితిలో రైలు ఇంజిన్ ఎక్కి గంటల తరబడి కూర్చుని పని చేయడం ఆయనకు సాధ్యం కాని పని. అందుకే తన సెలవును కొంచెం పొడిగించమని కోరుతూ చీఫ్ క్రూ కంట్రోలర్ (సీసీసీ) రతన్ కుమార్ దగ్గరికి వెళ్లారు.

నమ్మకం కలగలేదట!

రాజేష్ మీనా తన వెంట డాక్టర్ ఇచ్చిన రిపోర్టులు, తాను వాడుతున్న మందులు, కట్టిన బ్యాండేజీలు.. అన్నీ తీసుకువెళ్లారు. ‘అయ్యా, నాకు ఇంకా నొప్పి తగ్గలేదు, దయచేసి సెలవు ఇవ్వండి’ అని బతిమిలాడారు. కానీ ఆ అధికారి మాత్రం అస్సలు వినలేదు. ఆ రిపోర్టులన్నీ అబద్ధం అన్నట్లుగా మాట్లాడారు. దీంతో ఆవేదన చెందిన రాజేష్ మీనా, ఇక తన మాటలను నమ్మడం లేదని అర్థమై, వేరే దారి లేక ఆ అధికారి ముందే తన ప్యాంటు విప్పి, సర్జరీ జరిగిన చోట ఉన్న బ్యాండేజీలను చూపించారు. ఒక ప్రభుత్వ అధికారి స్థాయి మనిషి, తన ఆరోగ్యం గురించి నిరూపించుకోవడానికి ఇంతలా దిగజారాల్సి రావడం ఎంతటి దౌర్భాగ్యం?

యూనియన్ల జోక్యంతో న్యాయం

అంతలా చూపించినా కూడా ఆ అధికారి కనికరించలేదంటే ఆయన ఎంతటి కఠినాత్ముడో అర్థం చేసుకోవచ్చు. చివరికి రాజేష్ మీనా గిరిజన వర్గానికి చెందిన నాయకులను, రైల్వే యూనియన్ ప్రతినిధులను ఆశ్రయించారు. వారు వచ్చి గట్టిగా నిలదీయడంతో అప్పుడు కానీ ఆ అధికారికి జ్ఞానోదయం కలగలేదు. ఎట్టకేలకు ఆయనకు సెలవు మంజూరైంది. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని రాజేష్ మీనా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు రైల్వే ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది.

ఉద్యోగుల నిరసన

ఈ ఘటనపై ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (AILRSA) తీవ్రంగా స్పందించింది. ఒక ఉద్యోగికి సర్జరీ అయిందని తెలిసినా, ఆధారాలు చూపినా ఇంతలా వేధించడం ఏంటని మండిపడుతున్నారు. సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై స్పందించడానికి లక్నో డివిజన్ రైల్వే మేనేజర్ నిరాకరించడం గమనార్హం.

ఉద్యోగులు అంటే కేవలం యంత్రాలు కాదు, వారు కూడా రక్తమాంసాలు ఉన్న మనుషులే. ఒక లోకో పైలట్ అంటే వేల మంది ప్రయాణికుల ప్రాణాలను తన చేతుల్లో పెట్టుకుని రైలు నడిపే వ్యక్తి. అలాంటి వ్యక్తి అనారోగ్యంతో ఉంటే, అది ప్రయాణికుల భద్రతకు కూడా ముప్పే కదా! ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేని అధికారులు ఉండటం దురదృష్టకరం. రాజేష్ మీనాకు జరిగిన ఈ అవమానం మరో ఉద్యోగికి జరగకూడదు. ఇలాంటి అధికారుల తీరు మారాలి, అప్పుడే పని చేసే చోట మనుషులకు కనీస గౌరవం దక్కుతుంది.

Tags:    

Similar News