అమరావతి రాజధాని మాత్రమే కాదు.. జనాల సెంటిమెంటు కూడా!
ఏపీ రాజధాని అమరావతి.. కేవలం నగరం మాత్రమే కాదు.. 5 కోట్ల మంది ప్రజలకు ఇప్పుడు సెంటిమెంటుగా మారిన వ్యవహారం.;
ఏపీ రాజధాని అమరావతి.. కేవలం నగరం మాత్రమే కాదు.. 5 కోట్ల మంది ప్రజలకు ఇప్పుడు సెంటిమెంటుగా మారిన వ్యవహారం. రాజధానిని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఇది నిజమైంది. మూడు రాజధానులను భుజాన వేసుకుని ఎన్నికలకు వెళ్లిన.. వైసీపీ అధినేత జగన్‌కు ప్రజలు తిరుగులేని జవాబు చెప్పారు. గత ఏడాది కాలంలో రెండు సార్లు ప్రభుత్వం... స్వతంత్ర సంస్థలు కూడా అమరావతిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేశాయి.
ఈ క్రమంలోనే రాజధాని అంటే.. కేవలం నగరంగా చూస్తున్నామని చెప్పిన వారు.. 5 శాతం మంది ఉంటే.. ఏపీకి తలమానికం కానున్న రాజధాని ద్వారా.. తమకు, తమ పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుందని.. పెద్ద ఎత్తున రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పిన వారు.. 80 శాతం మంది ప్రజలు ఉన్నారు. మిగిలిన 10 శాతం మంది కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతిని మరింత విస్తరించేందుకు ఇక్కడి రైతులు కూడా ఇష్టపడుతున్నారు. కానీ, వారి సమస్యలు మాత్రమే పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇలా.. అమరావతి రాజధాని మాత్రమే కాకుండా.. జనాలకు సెంటిమెంటుగా మారిపోయింది. ఇలాంటి సెంటిమెంటును అర్థం చేసుకోలేని జగన్ ఇప్పటికీ.. అంటే.. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత కూడా.. అవాకులు పేలడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బాధ్యతాయుత మాజీ ముఖ్యమంత్రిగా.. ఆయనకు అభ్యంతరాలు ఉండొచ్చు. కానీ.. ప్రజల నాడి.. ప్రజల ఆకాంక్షలే ప్రజాస్వామ్యయుత రాష్ట్రంలో పాలకులకు.. నాయకులకు పరమార్థం కావాలన్న చిన్నపాటి సూత్రాన్ని ఆయన మరిచిపోతున్నారు.
నిజానికి.. అమరావతి వల్లే వైసీపీ ఘోరంగా దెబ్బతిందని అనేక విశ్లేషణలు వచ్చాయి. గుంటూరు జిల్లా నుంచి విజయవాడ వరకు వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. దీనికి కారణం అమరావతిని కాదనుకుని అడుగులు వేయడమే. రాజకీయంగా ఈ విషయాన్ని పక్కన పెట్టినా.. ప్రజల అభిప్రాయాన్ని.. న్యాయస్థానాల తీర్పులను, ఆదేశాలనైనా పట్టించుకోవాల్సిన ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు.. ఇప్పుడు కూడా తన నోటిని.. ఆలోచనలను నియంత్రించుకోలేక పోవడంపై సర్వత్రా విమర్శలు తెచ్చిపెడుతున్నాయి.