బొత్స కొడుకు Vs కూతురు.. ఇద్దరిలో చీపురుపల్లి ఎవరికి?
వైసీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.;
వైసీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బొత్స ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ పదవీకాలం వచ్చే ఏడాదితో పూర్తికావస్తోంది. మళ్లీ ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే పరిస్థితులు దాదాపు కనిపించడం లేదని అంటున్నారు. ఇదే సమయంలో బొత్స ఆరోగ్యంపై నెలకొన్న సందిగ్ధత వల్ల ఆయన భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగే పరిస్థితిపైనా సందేమాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిడి కారణంగా బొత్స తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. అంతేకాకుండా ఆయన వయసు కూడా ఏడు పదులు దాటుతోంది. దీంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని బొత్స ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ కారణంగానే ఆయన తన వారసులుగా కుమారుడు డాక్టర్ సందీప్, కుమార్తె డాక్టర్ అనూషను రంగంలోకి దింపారని చెబుతున్నారు.
బొత్స ప్రస్తుతం విశాఖ కేంద్రంగా పనిచేస్తున్నారు. అయితే ఆయన సొంత నియోజకవర్గం విజయనగరంలోని చీపురుపల్లిపై పట్టు మాత్రం వదులుకోకూడదని భావిస్తున్నారని అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి బొత్స వారసులుగా ఎవరు పోటీ చేస్తారనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. బొత్స ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అర డజను మంది క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఆయన భార్య, సోదరులు, మేనల్లుడు, మేనకోడలి భర్త ఇలా అంతా గతంలో ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీ చైర్పర్సన్ వంటి పదవుల్లో ఉన్నారు. బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఆయన బదులుగా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని భావించిన బొత్స మేనల్లుడు, విజయనగరం జడ్పీ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనును విశాఖ జిల్లాలోని భీమిలి ఇంచార్జిగా పంపించారు. చీపురుపల్లి నియోజకవర్గాన్ని తన వారసులకు కట్టబెట్టాలనే ఆలోచనతోనే చిన్నశ్రీనును చీపురుపల్లి నుంచి తప్పించారని చెబుతున్నారు. ఆయనను భీమిలి పంపడం ద్వారా బొత్స వారసులకు లైన్ క్లియర్ చేశారని చెబుతున్నారు.
అయితే బొత్స ఇద్దరు పిల్లల్లో ఎవరు చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారనేదే ఇప్పుడు సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. గత ఎన్నికల్లోనే బొత్స కుమారుడు సందీప్ చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారని భావించారు. అయితే ఆయనకు వైసీపీ అధిష్టానం చాన్స్ ఇవ్వలేదు. ఇక ఎన్నికల తర్వాత బొత్స కుమార్తె అనూష రంగంలోకి దిగారు. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ఎక్కువగా అనూష పర్యటిస్తున్నారు. దీంతో చీపురుపల్లి సీటును ఆమె కూడా ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో బొత్స ఇద్దరు పిల్లలు తండ్రి నియోజకవర్గాన్ని ఆశించడం, ఆ ఇద్దరిలో ఎవరికి బొత్స రైట్ చెబుతారనేది ఉత్కంఠగా మారిందని అంటున్నారు.
2004లో చీపురుపల్లి నుంచి తొలిసారిగా బొత్స గెలిచారు. ఆ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఓటు బ్యాంకు పెంచుకున్నారు. 2014, 2024 ఎన్నికల్లో బొత్స ఓడినప్పటికీ వ్యక్తిగత చరిష్మా కారణంగా నియోజకవర్గంలో వేరొకరి జోక్యాన్ని బొత్స సహించలేరని అంటున్నారు. ఈ కారణంగా కుటుంబంలోనే ఇతరులను నియోజకవర్గం నుంచి దూరం పెట్టారని అంటున్నారు. అయితే అదే నియోజకవర్గం కోసం ఇప్పుడు కూతరు, కొడుకు పోటీ పడటమే ఆసక్తి రేపుతోందని అంటున్నారు. ఇద్దరిలో బొత్స మద్దతు ఎవరికి ఉంటుంది? ఆయన ఎలా సర్దుబాటు చేస్తారనేది చూడాల్సివుంది.