భారత్ లో పెరుగుతున్న గృహ రుణభారం.. నిపుణుల సూచనలు ఇవే!
ఈ క్రమంలో... తీసుకున్న రుణాల్లో 46% వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, వినియోగ వస్తువులకు కేటాయించబడ్డాయని.. ఇది చాలా మంది భారతీయులు రోజువారీ ఖర్చులు, జీవనశైలి అవసరాలను క్రెడిట్ ద్వారా సమకూర్చుకుంటున్నారనే విషయాన్ని సూచిస్తుంది.;
మారుతున్న జీవనశైలి.. పెరుగుతున్న పట్టణ జనాభా.. గణనీయంగా పెరిగిన రుణ లభ్యత సౌలభ్యం కారణంగా దేశంలో గృహ రుణాల ధోరణులు నిరంతరం పెరుగుతున్నాయని.. గత కొంతకాలంగా వ్యక్తులు తీసుకున్న వ్యక్తిగత, ఇతర రుణాలలో భారీ పెరుగుదల ఉందని.. ఈ నేపథ్యంలో భారత్ లో సగటు గృహ రుణం 42%కి దగ్గరగా (41.3%) ఉందని.. అయితే ఇది ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో సగటు రుణం కంటే తక్కువే అని చెబుతూ.. ఆర్బీఐ నుంచి ఆసక్తికర నివేదిక తెరపైకి వచ్చింది.
అవును... భారత్ లో గృహ రుణం గత ఏడాది మార్చి నాటికి స్థూల దేశీయోత్పత్తిలో 41.3%కి పెరిగిందని.. ఇది ఐదేళ్ల సగటు (38.3%) కంటే స్థిరమైన పెరుగుదలను విస్తరించిందని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (ఎఫ్.ఎస్.ఆర్) తెలిపింది. అయితే... ఈ నిష్పత్తి ఐదేళ్ల సగటు 38.3%.. థాయిలాండ్ (88%), చైనా (60%), మలేషియా (69%) కంటే తక్కువగా ఉందని నివేదిక తెలిపింది!
ఈ క్రమంలో... తీసుకున్న రుణాల్లో 46% వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, వినియోగ వస్తువులకు కేటాయించబడ్డాయని.. ఇది చాలా మంది భారతీయులు రోజువారీ ఖర్చులు, జీవనశైలి అవసరాలను క్రెడిట్ ద్వారా సమకూర్చుకుంటున్నారనే విషయాన్ని సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా.. గృహనిర్మాణం, వాహనాలు వంటి ఆస్తి సృష్టి కోసం రుణాలు 36% వాటాను కలిగి ఉండగా.. 18% విద్య, వ్యవసాయం, చిన్న వ్యాపార సంస్థల వంటి ఉత్పాదక ప్రయోజనాల వైపు మళ్ళించబడ్డాయని నివేదిక తెలిపింది.
ఇక సేవింగ్స్ విషయానికొస్తే... నికర గృహ ఆర్థిక పొదుపులు 2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 5.2%గా ఉండగా.. 2025 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 7.6%కి పుంజుకున్నాయి. వీటిలో.. బ్యాంక్ డిపాజిట్లు పొదుపులో సుమారు 40% వద్ద ఆధిపత్యం చెలాయిస్తుండగా.. తర్వాత స్థానంలో ఈక్విటీ పెట్టుబడులు 23% వద్ద ఉన్నాయి. నగదు 7%కి కాస్త అటు ఇటుగా ఉంది! కాగా.. గత ఏడాది నవంబరులో గృహ రుణాల విలువ రూ.9 లక్షల కోట్లను అధిగమించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా స్పందిస్తున్న నిపుణులు... సెలవులు, ఖరీదైన గాడ్జెట్లు, ఇతర జీవనశైలికి సంబంధించిన ఖర్చులు వంటి స్వల్పకాలిక అంశాల కోసం క్రెడిట్ కార్డులు లేదా వ్యక్తిగత రుణాలు వంటి అధిక వడ్డీ వనరుల నుండి భారీ రుణాలు తీసుకోవడం మీ వ్యక్తిగత ఆర్థికానికి ప్రమాదకరమని చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఇల్లు కొనడం లేదా విద్యకు నిధులు సమకూర్చడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు తీసుకోవడం ఆదర్శంగా ఉండాలని అంటున్నారు! ఒక్కమాటలో చెప్పాలంటే... మీ నెలవారీ ఆదాయంలో తిరిగి చెల్లింపులు మీ30-40% మించకూడదని సూచిస్తున్నారు!