అమరావతి మీద జగన్ కామెంట్స్ కి బాబు స్ట్రాంగ్ కౌంటర్
ఎవరు ఏ విధంగా బాధపడినా అమరావతి ప్రపంచంలో బెస్ట్ డైనమిక్ సిటీ అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంటే జగన్ బాధ పడినా సరే అన్న అంతరార్ధం అందులో ఉందనే అంటున్నారు.;
ఏపీ రాజధాని ప్రాంతంగా అమరావతి అనుకూలమైనది కాదని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించిన సంగతి తెలిసిందే. అంతే కాదు అమరావతి రాజధానికి మౌలిక సదుపాయాల కొరత ఉందని అన్నారు. లక్షల కోట్ల భారీ ప్రాజెక్ట్ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు వేలాది ఎకరాల సేకరణ పేరుతో చేస్తున్నది సరైన పని కాదని కూడా హాట్ కామెంట్స్ చేశారు. అయితే బాబు జగన్ ప్రెస్ మీట్ కి పూర్తి స్థాయిలో అయితే రెస్పాండ్ అవలేదు, పైగా అధికారికంగా ఆయన పెద్దగా రియాక్ట్ కాలేదు, కానీ ఆవకాయ్ అమరావతి పేరుతో విజయవాడలో జరిగిన టూరిజం ఫెస్టివల్ లో బాబు మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా కౌంటర్ అయితే ఇచ్చేశారు.
ప్రపంచంలో బెస్ట్ డైనమిక్ సిటీ :
ఎవరు ఏ విధంగా బాధపడినా అమరావతి ప్రపంచంలో బెస్ట్ డైనమిక్ సిటీ అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంటే జగన్ బాధ పడినా సరే అన్న అంతరార్ధం అందులో ఉందనే అంటున్నారు. అమరావతి అన్నది నంబర్ వన్ సిటీ అని బాబు చెబుతూ అమరావతి పేరులోనే జయం తప్ప అపజయం అన్నది ఎక్కడా లేదని విస్పష్టంగా చాటి చెప్పారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీగా ఉంటుందని, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కూడా అమరావతిలో భాగమైపోతాయని బాబు చెప్పారు. అమరావతి రాజధానిగా శక్తివంతమైన రాష్ట్రంగా ఏపీని అన్ని విధాలుగా ముందుకెళ్తామని బాబు స్పష్టం చేశారు.
టూరిజం అతిపెద్ద ఆర్ధిక వనరుగా :
ఏపీకి అతి పెద్ద ఆదాయం తెచ్చేదిగా టూరిజం ఉండబోతోంది అని బాబు చెప్పారు. వచ్చే పదేళ్లలో ఏపీలో 50 వేల నుంచి లక్ష రూమ్ లు ఆతిథ్య రంగానికి అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. అలాగే ఇప్పటిదాకా అంతా గోవా బీచ్ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ తొందరలోనే సూర్యలంక బీచ్ అందాల గురించి చెప్పుకునే పరిస్థితి వస్తుందని బాబు ధీమాగా చెప్పారు. ఇక పోలవరంలో పాపికొండలు, ఫ్లెమింగో ఉత్సవాలు, గండికోట, అరకు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. అలాగే అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్ గా మారుతోందని బాబు వెల్లడించారు.
ఆవకాయ అంటే ఏపీనే :
ఆవకాయ అంటే ఆంధ్రాయే గుర్తుకు వస్తుందని బాబు చెప్పారు. కేవలం ఆవకాయ ఒక్కటే హాట్ కాదు ఏపీ చాలా రిచ్ ఫుడ్ అందిస్తుందని ఆయన అన్నారు. ఇక ఆహారంలో ఆతిథ్యంలో పరిశ్రమలో ఏపీని మించినవారు ఎవరూ లేరని బాబు తెలిపారు దేశంలోనే 25 శాతం పెట్టుబడులు ఏపీకే వచ్చాయని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేసారు. తెలుగుకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని, అంతా కలిసి మెలసి ఉండటం తెలుగు సంస్కృతిలో భాగమని బాబు చెప్పారు. సంస్కృతి, సాహిత్యం సినిమా తెలుగు ప్రజల బలంగా చంద్రబాబు అభివర్ణించారు.