దిశా రవికి బెయిల్.. రూ.లక్ష పూచీకత్తుపై మంజూరు

Update: 2021-02-23 12:39 GMT
కేంద్రప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన బెంగళూరుకు చెందిన పర్యావరణ వేత్త దిశారవికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. వ్యవసాయ చట్టాలపై ఉద్యమంలో భాగంగా ఆమె సోషల్ మీడియాలో ఏర్పాటు చేసిన ‘టూల్ కిట్' వ్యవహారంలో దిశ రవి అరెస్ట్ అయ్యింది. ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

తాజాగా ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు రూ. లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. సహా నిందితులు నికత జాకబ్, శంతను ములుక్ తో కలిపి ప్రశ్నించారు. ఇప్పటికే జాకబ్, ములుక్ సోమవారం విచారణ ఎదుర్కొన్నారు.

రైతుల నిరసనపై పర్యావరణ వేత్త గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసిన ‘టూల్ కిట్' మీద నమోదైన కేసులో దిశా రవిని ఈనెల 13న బెంగళూరులోని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఫిబ్రవరి 20న విచారణ జరిపిన తర్వాత తమ తీర్పును రిజర్వులో పెట్టింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది.

దిశారవి టూల్ కిట్ గూగుల్ డాక్యుమెంట్ ఎడిటర్. ఈ డాక్యుమెంట్ ను తయారు చేయడంలోనూ ప్రచారం చేయడంలోనూ ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సోషల్ మీడియా వ్యూహంతోపాటు, నిరసన ప్రదర్శనల సమాచారం కూడా టూల్ కిట్ లో ఉంటుంది. ఉద్యమం ఉద్ధృతం చేయడానికి దీనిని ఉపయోగించుకుంటారు. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ వర్గాలు అన్నీ ఈ టూల్ కిట్ తరహా ప్లాన్‌ను అమలు చేసుకుంటాయి.

 నిజానికి ఇది ఒకరు తయారు చేసేది కాదు.. ఎవరైనా ఎక్కడినుంచైనా గూగుల్ డాక్యుమెంట్ ఎడిట్ చేయొచ్చు. అందరి ఆలోచనలను అందులో పొందుపరిచి.. అన్నీ ఒకేచోట ఉండేలా చేయొచ్చు. ఇప్పుడీ టూల్‌ కిట్‌ను దిశా రవి రూపొందించారనేది పోలీసుల అభియోగం.
Tags:    

Similar News