కాశ్మీర్ ర‌చ్చ‌కు ఇదే స‌రైన ప‌రిష్కారం

Update: 2018-05-10 13:34 GMT
దేశ స‌రిహ‌ద్దుల్లో ఉన్న క‌శ్మీర్‌ లో నిత్యం రచ్చ‌గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. భార‌త్ ప‌రంగా ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల్లో టాప్ అనే పేరును తీస్తే...మొద‌టిది క‌శ్మీరే. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు క‌శ్మీర్‌ లో శాంతిని నెల‌కొల్పేందుకు ఖ‌ర్చు చేస్తున్న‌ప్ప‌టికీ...అక్క‌డి ప‌రిస్థితుల కార‌ణంగా దారిలోకి రావ‌డం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కశ్మీరీ యువతకు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఓ సందేశమిచ్చారు. ఇండియన్ ఎక్స్‌ ప్రెస్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిపిన్ రావత్ మాట్లాడుతూ.. క‌శ్మీర్ యువ‌త‌ తుపాకులు చేతబట్టడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ``కశ్మీర్‌ కు స్వాతంత్య్రం ఎప్పటికీ సాధ్యం కాదని వాళ్లకు చెప్పాల్సిన అవసరం ఉంది.. మీరిలా ఆర్మీతో పోరాడటం సరికాదు` అని రావత్ కశ్మీర్ యువతకు పిలుపునిచ్చారు. ``నేను కశ్మీర్ యువతకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. ఆజాదీ సాధ్యం కాదు. అది ఎప్పటికీ రాదు. దానికోసం అనవసరంగా పోరాటాలు చేయకండి. మీరు ఆయుధాలను ఎందుకు పట్టుకుంటున్నారు? ఆజాదీ కోరుకునే వాళ్లతో మేమెప్పుడూ పోరాడుతూనే ఉంటాం. ఆ ఆజాదీ మీకు ఎప్పటికీ రాదు`` అని రావత్ స్పష్టంచేశారు.

 కశ్మీరీ యువత ఆగ్రహంతో ఉన్న విషయం తనకూ తెలుసని - అంతమాత్రాన భద్రతా బలగాలపై రాళ్లదాడి సరికాదు అని రావ‌త్ అన్నారు. ఆజాదీ కోసం యువతతో ఆయుధాలు పట్టించడమే ఆందోళన కలిగిస్తున్నదని  వెల్ల‌డించారు. ``ఈ పోరాటంలో ఎంతమంది మిలిటెంట్లు చనిపోయారన్నది నాకు అనవసరం. ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగుతుంది. ఇప్పటికే కొత్తగా రిక్రూట్ చేసుకుంటూనే ఉన్నారు. నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. దీనివల్ల సాధించేదేమీ లేదు. మీరు ఆర్మీతో పోరాడటం సరికాదు`` అని రావత్ చెప్పారు. కశ్మీరీ యువత చనిపోవడం తనకు కూడా బాధ కలిగిస్తున్నదని ఆయన అన్నారు. ``దీనిని మేమేమీ ఆస్వాదించడం లేదు. కానీ మీరు మాతో ఫైట్ చేయాలనుకుంటే మేము కూడా పూర్తి బలగంతో పోరాడుతాం. అయినా పాకిస్థాన్, సిరియాల్లోలాగా ఇక్కడ భద్రతా బలగాలు మరీ అంత కఠినంగా ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితులు వస్తే ఆ దేశాల్లో యుద్ధ ట్యాంకులు - వైమానిక దళాలనూ వాడుతారు. మమ్మల్ని ఎంతగా రెచ్చగొడుతున్నా మా బలగాలు మాత్రం పౌరులకు ఎలాంటి హాని కలుగకుండా చూస్తున్నారు`` అని రావత్ చెప్పారు.
Tags:    

Similar News