మాజీ మంత్రి అవంతి లీల‌లు.. ఎన్నెన్నో క‌దా!!

Update: 2022-05-22 02:30 GMT
మంత్రి పదవి పోయిన తనను.. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారో ఏమో గానీ.. అందరూ తనను పట్టించుకోవాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి. పదవి లేకపోయినా పనులు చేస్తానని, ఇతర మంత్రుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, అవసరమైతే సీఎంతో మాట్లాడుతానని కూడా అన్నారు! ఆయనే.. మాజీమంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు.

"నాకు మంత్రి పదవి లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు వేరే మంత్రుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ తర్వాత నేనే సీనియర్‌ని. ఎలాంటి పనులున్నా చేయగలను. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తా. కాబట్టి పక్క జిల్లాల మంత్రుల దగ్గరకు వెళ్లొద్దు`` అని  ఇటీవల మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవిని కోల్పోయిన భీమిలి ఎమ్మెల్యే  అవంతి శ్రీనివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  

తనకు మంత్రి పదవి లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు వేరే మంత్రుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స తర్వాత తానే సీనియర్‌ని కూడా చెప్పారు. ఎలాంటి పనులున్నా చేయగలనన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని కూడా హామీ ఇచ్చారు. అందువల్ల ఎవరూ పక్క జిల్లాల మంత్రుల వద్దకు వెళ్లొద్దని తన నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులకు సూచించారు.  విశాఖ జిల్లా భీమిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు, సమస్యల గురించి చెప్పడంతో ఆయన స్పందించి ఇలా అన్నారు.

విశాఖ‌లో.. ఇటీవ‌ల జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కూడా మాజీ మంత్రి అవంతి ఏకంగా మంత్రి ముందే.. పోలీసుల‌పై విరుచుకుప‌డ్డారు. ‘ఏయ్‌ ఎస్ఐ... ఎందుకయ్యా నీకు ఉద్యోగం ఇచ్చింది’ అంటూ మండిపడ్డారు. రైతు భరోసా 4వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో   సూర్యనారాయణ అనే రైతు... తన 98 సెంట్ల జిరాయితీ భూమిని జగనన్న కాలనీకి అన్యాయంగా తీసుకున్నారనే విషయం చెప్పేందుకు వేదిక వద్దకు వ‌చ్చారు.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వంపై స‌ద‌రు బాధితుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే.. స‌భ‌లోనే ఉన్న అవంతి..  పోలీసుల సాయంతో ఆయనను  బ‌ల‌వంతంగా బయటకు పంపించి వేశారు. ఆ రైతును ఎందుకు నిలువరించలేదంటూ స్థానిక ఎస్ఐపై మండిపడ్డారు. ఈ సందర్భంలో ఓ మీడియా ప్రతినిధిపై ‘నీ సంగతి చూస్తానంటూ’ బెదిరింపులకు దిగారు. ‘అన్నీ ఇస్తుంటే ఇలాగే ఉంటుంది. మీ వద్దకు  వస్తున్నామని చులకనగా చూడొద్దు’ అని ప్రజలనుద్దేశించి హెచ్చ‌రించారు. ఇదీ.. అవంతి సంగ‌తి.. అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News