మోడీ స‌ర్కారు ఆ త‌ప్పు చేయ‌ద‌ట‌

Update: 2017-04-27 06:50 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇటీవ‌లి కాలంలో అన్ని వ‌ర్గాల నుంచి అత్యంత ఘాటు నిర‌స‌న ఎదుర్కున్న అంశం ఏదైనా ఉందంటే...అది వ్యవసాయ ఆదాయంపై ఆదాయపు పన్ను విధించాలన్న ప్ర‌తిపాద‌న‌లోనే. అన్న‌దాత‌ల ఆదాయంపై సైతం ప‌న్ను విధించాల‌నే నిర్ణ‌యంపై పెద్ద ఎత్తున నిరస‌న వ్య‌క్త‌మైంది. ఆదాయపు పన్ను పరిధిని విస్తరింపజేయాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా వ్యవసాయ రంగం నుంచి ఆర్జించే ఆదాయంపైన కూడా పన్ను విధించాలని నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో న‌ష్ట నివార‌ణ ప్ర‌క‌ట‌నలు వెలువ‌డ్డాయి. రైతుల ఆదాయంపై ప‌న్ను విధింపు యోచ‌న  లేదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.

ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కూడా స్పందిస్తూ..వ్యవసాయ ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పన్ను వేయబోవడం లేదని ట్విట్టర్‌ లో తెలిపారు.  కాగా రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాల ప్రకారం వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే అవకాశం కేంద్రానికి లేదని జైట్లీ స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా ఇదే తరహా ప్రకటనను విడుదల చేసింది. నీతి ఆయోగ్ నివేదికలో వ్యవసాయ ఆదాయంపై పన్ను అనే శీర్షిక కింద ఉన్న మొత్తం అంశాలను క్షుణ్ణంగా చదివానని, స్పష్టత కోసమే ఈ ప్రకటన ఇవ్వాల్సి వస్తున్నదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారని ఆ ప్రకటన తెలిపింది.

మ‌రోవైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలో ప‌నిచేసే బృంద‌మైన నీతి ఆయోగ్...త‌మ‌ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. వ్యవసాయంపై ఆదాయపు పన్ను విధించాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని, తమ మూడేళ్ల‌ కార్యాచరణ ప్రణాళికలో సైతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని నీతి ఆయోగ్ అధికారికంగా ప్రకటించింది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, రైతుల ఆదాయాన్ని రానున్న ఐదేళ్ల‌లో రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే ఆలోచనేదీ లేదని ఒక ప్రకటనలో నీతిఆయోగ్ స్పష్టంచేసింది. బిబేక్ దేబ్రాయ్ మంగళవారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవేనని నొక్కిచెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News