హైదరాబాద్ లో ఉగ్ర హడావుడి.. అసలేం జరిగిందో తెలిస్తే అవాక్కే

Update: 2019-09-24 10:49 GMT
మీడియా సంస్థలు పరిమితం ఉన్నప్పుడు సమాచారం విషయంలో కాస్త కొరత ఉన్నా.. కచ్ఛితత్వం విషయంలో అంతో ఇంతో నమ్మకం ఉండేది. ఇప్పుడు బోలెడన్ని మీడియా సంస్థలు.. వాటికి సంబంధించిన వెబ్ సైట్లు.. ఇవి సరిపోనట్లు సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపులు.. ఇలా మస్తు మాథ్యమాలు  జనాలకు అందుబాటులోకి వచ్చాయి.

కదిలే కాలంతో పోటీ పడుతున్నట్లుగా.. ఏదో ఒక చోట ఏదో ఒక వార్త పోస్టు అవుతున్న పరిస్థితి. ఇలాంటి సందర్భంలో చెడు కంటే మంచి ఎక్కువ జరగాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా నిత్యం ఏదో ఒక పుకారు షికారు చేస్తున్న పరిస్థితి. తాజాగా అలాంటి పరిస్థితే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఎప్పటిలానే తాజా పుకారు విషయంలో మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా ఉండటంతో లక్షలాది మందిలో అనవసరమైన టెన్షన్ జస్ట్ మిస్ అయిన పరిస్థితి.

ఆర్టికల్ 370 నిర్వీర్యం.. తదనంతరం కశ్మీర్ వ్యాలీలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఈ వ్యవహారంతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. దీంతో.. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వేళ హైదరాబాద్ లోకి ఒక ఉగ్రవాది సంచరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. జనబాహుళ్యంలోకి పెద్దగా వెళ్లలేదు కానీ మీడియా వర్గాల్లో మాత్రం కాసేపు అలజడి రేపింది.

లక్కీగా ఏ మీడియా సంస్థ తొందరపాటుతో వ్యవహరించకపోవటం.. ఒకరిద్దరు హడావుడి చేసే ప్రయత్నం చేసినా.. అందులో నిజం లేదన్న విషయాన్ని గుర్తించిన క్రైం రిపోర్టర్లు.. తమ బాసుల్ని అలెర్ట్ చేయటంతో ఒక పెద్ద పుకారుకు ఆదిలోనే పుల్ స్టాప్ పడింది. ఇంతకీ ఈ పుకారుకు కారణం ఏమిటి? ఎక్కడ మొదలైందన్నది చూస్తే.. బైసన్ పోలో గ్రౌండ్స్ లోకి మతి స్థితిమతం లేని సీఆర్ఫీఎఫ్ మాజీ ఉద్యోగి ఒకరు ప్రవేశించటం.. అక్కడి క్యాంటీన్ లోకి వెళ్లి హడావుడి చేశారు. దీంతో.. అలెర్ట్ అయిన వారు.. అతడ్ని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు.

ఈ విషయం బయటకు వేరేగా విస్తరించింది. అయితే.. ఇందులో నిజం లేదని.. ఈ పుకారును అనవసరంగా ప్రయారిటీ ఇచ్చి ప్రజల్ని గందరగోళానికి గురి చేయొద్దన్న స్పష్టత పోలీసుల నుంచి రావటంతో బ్రేకింగ్ న్యూస్ రచ్చకు పుల్ స్టాప్ పెట్టేలా చేసింది. ఇదిలా ఉంటే..కొన్ని వెబ్ సైట్లలో ఎప్పటిలానే హైదరాబాద్ లో ఉగ్రవాది కలకలమని.. ఒకరు సంచరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నా.. అవన్నీ ఒకట్రెండు సైట్లకే పరిమితం కావటంతో ఈ తరహా వార్తలు పెద్దగా విస్తరించలేదు. మొత్తంగా చెప్పేదేమంటే.. సోషల్ మీడియాలో కానీ.. వాట్సాప్ గ్రూపుల్లో కానీ వచ్చే వార్తల్ని వందశాతం అబద్ధమని చెప్పక తప్పదు. సో.. మీ వద్దకు ఇలాంటి ప్రస్తావన తీసుకొస్తే.. అనవసరమైన అదుర్దాకు గురి కావొద్దని చెప్పటమే అసలు ఉద్దేశం.
Tags:    

Similar News