మొన్న కేసీఆర్.. నిన్న రేవంత్ .. నేడు కేటీఆర్.. పైట్ ముదిరింది..

నువ్వు ఒకటంటే.. నేను మరొకటి అంటా.. దీన్ని కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా తెలంగాణ రాజకీయాల్లో మాటల మంటలు రాజుకున్నాయి.;

Update: 2025-12-26 10:29 GMT

నువ్వు ఒకటంటే.. నేను మరొకటి అంటా.. దీన్ని కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా తెలంగాణ రాజకీయాల్లో మాటల మంటలు రాజుకున్నాయి. మొన్న చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకొచ్చి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డాడు. మొత్తం కాంగ్రెస్ సర్కార్ చర్యలను డిఫెన్స్ లో పడేసేలా చేశాడు. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి అంతకుమించిన పదజాలం వాడుతూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ లపై ఓ రేంజ్ లో దుమ్మెత్తిపోశాడు. కొన్ని వ్యక్తిగత విమర్శలకు దిగాడు. ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది. కేసీఆర్ నీట్ గా చెబితే.. కేటీఆర్ మాత్రం కాస్త కఠువుగానే ఈసారి కౌంటర్ ఇచ్చాడు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ డైలాగ్ వార్ యమ రంజుగా పతాకస్థాయికి చేరింది.

తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగానే కంటిన్యూ చేశారు. తన తండ్రి పేరు చెప్పుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. తాను గుంటూరులో చదివితే రేవంత్ కు వచ్చిన బాధేంటని నిలదీవారు. రేవంత్ అల్లుడిది ఆంధ్రా కాదా? అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

రేవంత్ పై తన విమర్శల దాడిని కేటీఆర్ కంటిన్యూ చేశారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ కు సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చస్తాడని ఎద్దేవా చేశారు. ‘మా అయ్య మొగోడు.. తెలంగాణ తెచ్చిన మొనగాడు’ అని కేటీఆర్ వీరావేషంతో అన్నాడు. మా అయ్య పేరు బరాబర్ చెప్పుకుంటానని స్పష్టం చేశాడు. నీ లెక్క సంచులు మోసుకుంటే నీ పిల్లలు చెప్పుకోరు అని విమర్శించారు. రేవంత్ రెడ్డిని కొడంగల్ లో ఎమ్మెల్యేగా గెలవకుండా చేసే బాధ్యత మాది అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి భాషను చూస్తే పిల్లలు నేర్చుకునే పరిస్థితి ఉందని అన్నారు.

అసలు ముందు కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జావాబు ఇవ్వు అని కేటీఆర్ డిమాండ్ చేశాడు. పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్ ను వెనక్కి పంపితే ఏం చేస్తున్నావని కేసీఆర్ అడిగారని.. 10 శాతం పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా రేవంత్ బూతులు మాట్లాడుతున్నాడని.. అందులో తప్పేముందని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.

ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డికి కోపమొస్తుందని కేటీఆర్ అన్నారు.‘ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి’ అని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మొత్తంగా తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వేడి రాజుకుంది. కేసీఆర్ అంటించిన మాటల మంటలు రేవంత్, కేటీఆర్ లతో పతాకస్తాయికి చేరాయి. హామీలు, నిలదీతలు, వ్యక్తిగత దూషణలతో ఈ విమర్శల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. మున్ముందు ఈ దాడి ఏ స్థాయికి పెరుగుతుందన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News