ఏపీలో జిల్లాలు 25 కాదు.. 26.. మరోటి ఇదే

Update: 2020-07-15 15:30 GMT
అసెంబ్లీ ఎన్నికల వేళ.. పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ప్రతి జిల్లా భౌగోళిక సరిహద్దు పార్లమెంటరీ నియోజకవర్గం యొక్క అధికార పరిధికి అనుగుణంగా ఉంటుందని వివరించారు.

ఆ జిల్లాల హామీని తాజాగా సీఎం జగన్ కార్యరూపంలోకి తీసుకొచ్చారు. అమరావతిలో బుధవారం సీఎం జగన్ నాయకత్వంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాల స్థానంలో మొదట 25 జిల్లాలు అనుకోగా.. ఇప్పుడు వచ్చిన ఒక కొత్త ప్రతిపాదనతో 26 జిల్లాలు ఉండబోతున్నాయి. మొదట అనుకున్నట్లుగా 25 జిల్లాల్లో ఒక జిల్లాను అదనంగా పెంచారు.

ఏజెండాలో 22 సమస్యలపై చర్చించిన మంత్రివర్గం.. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను డీలిమిటేషన్ చేయడం ద్వారా 26 కొత్త జిల్లాలను రూపొందించడానికి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి కొత్త జిల్లాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించి అధ్యయనం చేసి సిఫారసు చేయాలని కోరారు.

కొత్త జిల్లాల ఏర్పాటును మార్చి 31 లోపు పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రస్తుత జిల్లాల డీలిమిటేషన్‌లో ఏ రాజకీయ నాయకులూ పాల్గొనరని.. ప్రజాభిప్రాయమే ప్రతిపాదిక అని తీర్మానించింది.

రాష్ట్రంలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలు ఉంటాయని సీఎం జగన్ కేబినెట్ తొలుత నిర్ణయించింది. అయితే అరకు పార్లమెంటరీ నియోజకవర్గం భౌగోళికంగా చాలా పెద్దదని.. నాలుగు జిల్లాల అంత విస్తీర్ణం కలదని.. అందుకని అరకును రెండు జిల్లాలు చేస్తేనే ప్రజలకు పాలన చేరువ అవుతుందని ఉప ముఖ్యమంత్రి పాములా పుష్ప శ్రీవానీ కేబినెట్ లో సీఎం జగన్ కు సూచించారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా విభజించాలని ఆమె విన్నవించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని జగన్ అధికారులను కోరారు. ఇది కనుక అమలైతే ఏపీ మొదట అనుకున్న 25 జిల్లాలకు బదులుగా 26 జిల్లాలు ఉంటాయి.
Tags:    

Similar News