వెంక‌య్య‌కు ఏపీ మంత్రుల కౌంట‌ర్, ఆ నిధులిప్పించండ‌ని లేఖ‌!

Update: 2020-03-05 12:15 GMT
ఏపీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల విష‌యంలో ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు చేసే పొలిటికల్ కామెంట్ల గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఇంగ్లిష్ మీడియంల‌ను వ్య‌తిరేకించారు వెంక‌య్య‌, అలాగే ఏపీకి మూడు రాజ‌ధానుల ఫార్ములా విష‌యంలోనూ ఒకింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. *ఎవ‌రికి చెప్పాలో వారికి చెబుతా..*అంటూ వెంక‌య్య ఏదో బెదిరింపు ధోర‌ణితో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అజెండాకు అనుగుణంగా స్పందిస్తూ వ‌స్తున్నారు వెంక‌య్య‌నాయుడు. గ‌తంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు, వెంక‌య్య‌నాయుడుకు ఉన్న సాన్నిహిత్యం ఏమిటో అంద‌రికీ తెలిసిందే. తామిద్ద‌రి సాన్నిహిత్యం గురించి చంద్ర‌బాబు నాయ‌డు కొన్ని చెప్పారు కూడా. అవ‌కాశం ఉంటే తామిద్ద‌రం అక్క‌డెక్క‌డో పుట్టేవాళ్ల‌మంటూ చేసిన వ్యాఖ్యానం ఒక‌టి దుమారం రేపింది.

వెంక‌య్య నాయుడు ఉప రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోవ‌డంతో ఆయ‌న రాజ‌కీయానికి చాలా వ‌ర‌కూ అవ‌కాశం త‌గ్గింది. అయినా ఏపీలో వైసీపీ గెలిచిన త‌ర్వాత వెంక‌య్య ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా చేసిన కొన్ని కామెంట్లు వార్త‌ల్లోని అంశాలుగా నిలిచాయి.

ఇవ‌న్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల‌కు కానీ, ఏపీ జ‌నాల‌కు కానీ తెలియ‌నివి ఏమీ కావు. అవ‌న్నీ ఒక ఎత్తు అయితే.. ఏపీలో ధాన్యం సేక‌ర‌ణ అంశం గురించి వెంక‌య్య నాయుడు అధికారులతో స‌మీక్ష నిర్వ‌హించార‌ట‌, అలాగే ఈ విష‌యంలో కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ‌, ఆహార శాఖ‌ల మంత్రుల‌తోనూ మాట్లాడార‌ట. ఈ మేర‌కు ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ విష‌యంలో ఏపీ మంత్రులు స్పందించారు. ఈ స్పంద‌న కౌంట‌ర్ లాగా ఉండ‌టం కాదు, కౌంట‌రే అనుకోవాల్సి వ‌స్తోంది.

ఉప రాష్ట్ర‌ప‌తి హోదాలో ఉన్నా.. వెంక‌య్య నాయుడు ఏపీ కోసం చాలా తాప‌త్ర‌య‌ప‌డుతూ ఉన్నార‌ని, దానికి ధ‌న్య‌వాదాలంటూ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ లు మొద‌లుపెట్టార‌ట‌. ఏపీలో ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో అధికారుల‌తో, మంత్రుల‌తో స‌మీక్ష నిర్వ‌హించార‌ని, ఆ శ్ర‌ద్ధ చాలా బాగుంద‌ని.. ఇదే స‌మ‌యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బ‌కాయిల గురించి కూడా కాస్త సిఫార్సు చేయాలంటూ ఉప రాష్ట్ర‌ప‌తిని కోరార‌ట మంత్రులు.

కేంద్రం నుంచి ధాన్యం సేక‌ర‌ణ‌కు సంబంధించే ఏపీకి 4,724 కోట్ల రూపాయ‌ల రావాల్సి ఉంద‌ని, వాటి చెల్లింపుల విష‌యంలో కూడా మంత్రుల‌తో మాట్లాడాల‌ని ఉప రాష్ట్ర‌ప‌తిని కోరార‌ట మంత్రులు. ధాన్యం సేక‌ర‌ణ గురించి అంత శ్ర‌ద్ధ చూపిన ఉప రాష్ట్ర‌ప‌తి కేంద్రం నుంచి రావాల్సిన డ‌బ్బుల విష‌యంలో కూడా శ్ర‌ద్ధ చూపించాల‌ని వారు కోరార‌ట‌. అలాగే కేంద్రం వ‌ద్ద ఏపీకి సంబంధించిన పెండింగు అంశాలనూ ప‌రిష్క‌రించాల‌ని ఉప రాష్ట్ర‌ప‌తికి ఏపీ మంత్రులు లేఖ‌లు రాసిన‌ట్టుగా స‌మాచారం. త‌న ప‌రిధికాని అంశంలోకి ఇన్ వాల్వ్ కావ‌డంతోనే ఉప రాష్ట్ర‌ప‌తికి ఏపీ మంత్రులు ఇలాంటి కౌంట‌ర్ లేఖల‌ను రాశార‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.


Tags:    

Similar News