మంత్రి పినిపేకు మ‌నీ క‌ట్ట‌ల‌తో స్వాగ‌తం.. ర్యాలీలో నోట్ల క‌ట్ట‌లు విసిరేసిన అభిమానులు

Update: 2022-04-14 15:30 GMT
తమ నేతకు మంత్రి పదవి దక్కిందని కార్యకర్తలు రెచ్చిపోయారు. మంత్రి ఊరేగింపులో సందడి చేశారు. అంతటితో ఆగకుండా.. నడిరోడ్డుపై కరెన్సీ నోట్లు ఇష్టమొచ్చినట్లు విరజిమ్మారు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో లేని కొత్త సంప్రదాయానికి తెరతీశారు. అయితే వైసీపీ నేతల తీరును పలువురు తప్పుపడుతున్నారు. సంబరాలకు ఓ పరిమితి ఉంటుందని అంటున్నారు. కోనసీమ జిల్లా అమలాపురం శాసనసభ్యుడు పినిపే విశ్వరూప్ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరించిన విష‌యం తెలిసింది.

జ‌గ‌న్ గ‌త కేబినెట్లోనూ ప‌నిచేసిన ఆయ‌న తాజాగా 2.0 కేబినెట్‌లోనూ చోటు ద‌క్కించుకున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం.. బుధ‌వారం రాత్రి సొంత నియోజ‌క‌వ‌ర్గం అమలాపురం చేరుకున్నారు. ఈ క్ర‌మంలో అభిమానులు, అనుచరులు.. చోటా నేత‌లు.. ఊరేగింపుగా మంత్రిని కోన‌సీమ‌లోకి ఆహ్వానించారు. మంత్రిగారి ఊరేగింపులో వైసీపీ నాయకుడు, నగర వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్ముల కొండలరావు మంత్రి విశ్వరూప్కు పూలమాలలు వేసి నడిరోడ్డుపై కరెన్సీ నోట్లు విరజిమ్మారు.

దీంతో అంద‌రూ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డ్డారు. అనంతరం ఆ నోట్లను అక్కడే ఉన్న కార్యకర్తలు పోటీపడి మరీ ఏరుకున్నారు. అదేవిధంగా  కరెన్సీ నోట్లను జనాలు కూడా ఏరుకున్నారు. అయితే.. అదేస‌మ‌యంలో ఈ సంఘటన విమర్శలకు దారి తీసింది. రోడ్లపై కరెన్సీ నోట్లు వెదజల్లడం, బైక్‌లతో విన్యాసాలు చేయ‌డం, సైలెన్సర్లు విప్పి జీరో కట్‌లతో హల్ చల్ చేయడం వంటివి స్థానికంగా నాలుగు గంట‌ల పాటు.. ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపించాయి.

విశ్వరూప్‌కు రెండోసారి మంత్రి పదవి రావడంతో ఆయన అనుచరులు రెచ్చిపోయారు. నిన్న విశ్వరూప్ మంత్రిగా ప్రమాణం చేసి తొలిసారిగా అమలాపురానికి రావడంతో కార్యకర్తలు, అభిమానులు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అమలాపురంలో గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోలేదు. కార్యకర్తలు చేస్తున్న హంగామాను మంత్రి విశ్వరూప్ అడ్డు చెప్పకుండా ప్రోత్సహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మ‌రి ఈ హంగామాపై జ‌గ‌న్ ఏం చెబుతారో చూడాల‌ని అంటున్నారుప‌రిశీల‌కులు.
Tags:    

Similar News