ఫోన్‌ ట్యాపింగ్ ‌పై హైకోర్టు విచారణ .. ఏమైందంటే ?

Update: 2020-08-18 10:10 GMT
ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాయడంతో వివాదం రాజుకుంది. ఏపీలో ప్రతిపక్షాలు, న్యాయమూర్తులు, కీలక వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయన్నారు చంద్రబాబు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. టెలిఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశించాలన్నారు. ఆ  తర్వాత ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికార… ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ప్రతిపక్షాల మాటలకి ఎవరి ఫోన్లు ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం తమకు లేదని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు అంబటి రాంబాబు.

దీనిపై కొందరు కోర్టుకు ఆశ్రయించారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి ఇదని.. దీనిని వెంటనే విచారణకు స్వీకరించాలని లాయర్‌ శ్రవణ్‌ కుమార్‌ హైకోర్టును కోరారు. దీంతో పిటిషన్ స్వీకరించిన కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.  ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి ఆదేశించింది. అలాగే ఈ అంశం పై  దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో కౌంటర్‌ దాఖలు చేయాలని సర్వీస్‌ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే ఎల్లుండి లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సర్వీసు ప్రొవైడర్ల నుంచి వివరాలు అందాకే దీనిపై స్పందిస్తామంటూ హైకోర్టు విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది.
Tags:    

Similar News