ఏపీలో రేషన్ బియ్యం వద్దంటే.. డబ్బులు ఇచ్చేస్తారట!

Update: 2020-08-25 05:45 GMT
సంక్షేమ పథకాల్ని వినూత్నంగా అమలు చేస్తూ.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. పేదలకు అందించే బియ్యం నాణ్యత ఎలా ఉంటుందో తెలిసిందే. అందుకు భిన్నంగా నాణ్యమైన బియ్యాన్ని పేదలకు అందించటమే కాదు.. వారి ఇళ్లకే నేరుగా వెళ్లి ఇచ్చి వచ్చేలా జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది.

ఇందుకోసం భారీ వ్యవస్థనే సిద్ధం చేస్తున్నారు. ఇంటికే వెళ్లి లబ్థిదారులకు బియ్యాన్ని డెలివరీ చేసేందుకు వీలుగా 9260 వాహనాల్ని ఏపీ సర్కారు సిద్ధం చేస్తోంది. అంతేకాదు.. లబ్థిదారులకు.. నాణ్యమైన సంచిలో ప్యాక్ చేసిన బియ్యాన్ని అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక పంపిణీ వ్యవస్థను సిద్ధం చేయటమే కాదు.. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్నారు.

డెలివరీ వాహనాల్ని ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనార్టీ.. ఈబీసీ యువతకు అవకాశం ఇవ్వటం.. వాహనం కొనుగోలుకు60 శాతం సబ్సిడీ.. 30 శాతం లోన్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. కేవలం 10 శాతం చెల్లించి వాహనాన్ని సొంతం చేసుకునేలా నిర్ణయాన్ని తసీుకున్నారు. ఆరేళ్ల వ్యవధిలో లోన్ ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం.. లబ్థిదారుల పేరుతో వాహనం రిజిస్టర్ కానుంది.

ఇదే కాదు.. బియ్యం పంపిణీలోనూ కొత్త తరహా నిర్ణయాన్ని తీసుకునే దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తుంది. రేషన్ బియ్యాన్ని పొందే లబ్థిదారులు.. ఒకవేళ తమకు ఆ బియ్యం వద్దనుకుంటే..దానికి సరిపడా మొత్తాన్ని ఇవ్వాలన్న ఆలోచనలో జగన్ సర్కారు ఉంది. దీనికి సంబంధించిన విధివిధానాల్ని త్వరలోనే ప్రకటిస్తారని చెబుతున్నారు.

తొలుత కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసి.. తర్వాత అన్నిచోట్ల అమలు చేస్తారంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బియ్యం వద్దని అనుకునే లబ్థిదారులకు కేజీ బియ్యానికి రూ.25 నుంచి రూ.30 వరకు ప్రభుత్వం నగదు ఇస్తుందని చెబుతున్నారు. ఒకవేళ అలాంటి నిర్ణయాన్ని ఏపీ సర్కారు తీసుకుంటే.. అదో సంచలనంగా మారుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News