పోలవరంపై రివ్యూ వేళ.. సీఎం జగన్ అంత సీరియస్ ఎందుకయ్యారు?

Update: 2020-12-14 12:56 GMT
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. పోలవరం పర్యటన సందర్భంగా పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం అధికారులతో కలిసి ఒక రివ్యూను నిర్వహించారు. ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. హెలికాఫ్టర్ లో ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎంకు మంత్రులు స్వాగతం పలికారు.

2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలని.. నీరు అందించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వాదనల్ని తిప్పి కొట్టాలన్నారు. దాదాపు మూడు గంటల పాటు ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదన్న ఆయన.. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఎఫ్ఆర్ఎల్ లెవల్ 45.72 మీటర్లు ఉంటుందన్నారు.

టాప్ ఆఫ్ మొయిన డ్యాం లెవల్ 55 మీటర్లు ఉంటుందని చెప్పిన జగన్.. డ్యామ్ నిర్మాణంతో పాటు.. పునరావాస కార్యక్రమాల్ని కూడా అంతే వేగంగా పూర్తి చేయాలన్నారు. వచ్చే మే నాటికి స్పిల్ వే.. స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఫోటో గ్యాలరీని పరిశీలించిన ఆయన.. కాఫర్ డ్యాం వద్దకు చేరుకొని.. అక్కడి నిర్మాణ పనుల్ని పరిశీలించారు. తాజా రివ్యూతో పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారన్న విష ప్రచారానికి సీఎం జగన్ చెక్ చెప్పినట్లైంది.
Tags:    

Similar News