అత్యున్నత అధికారులకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ?

Update: 2022-02-15 17:30 GMT
షాకింగ్ నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అత్యున్నత పదవులకు ఏరికోరి మరీ తీసుకొచ్చిన ఇద్దరు అత్యుత్తమ అధికారుల విషయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకోవటం ద్వారా సంచలనంగా మారారు. రెండు రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి కీలకమైన ఇద్దరు అధికారుల విషయంలో ఆయన అనుసరించిన విధానాన్ని చూసిన వారందరికి నోట మాట రాని పరిస్థితి.

సీఎంవో తిరుగులేని రీతిలో అధికారం చెలాయించటమే కాదు.. షాడో సీఎంగా పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్. ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఆయనపై బదిలీ వేటు వేసి.. ఏకంగా ఢిల్లీకి పంపేసిన వైనం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయనపై ఎన్నో ఆరోపణలు రావటం.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా.. పట్టనట్లుగా వ్యవహరించిన సీఎం జగన్ అనూహ్యంగా వారిపై చర్యలు తీసుకోవటం గమనార్హం.

ఏపీ సీఎంవోకు రావటానికి ముందు ప్రవీణ్ ప్రకాశ్.. ఢిల్లీలోని ఏపీ భవన్ కు రెసిడెంట్ కమిషనర్ గా పని చేసేవారు. అక్కడి నుంచి ఏరికోరి మరీ తీసుకొచ్చిన సీఎం జగన్ ఆయన్ను నెత్తిన పెట్టుకున్నారు. పవర్ ఫుల్ ముఖ్యమంత్రి నెత్తిన పెట్టుకున్న వేళ.. ప్రవీణ్ ప్రకాష్ ఏ మాత్రం తగ్గకుండా చెలరేగిపోయారని చెబుతారు.

ఆయన తీసుకున్న పలు నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వం ఇరుకున పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం వేళ.. ఆఫీసు టైం అయిన తర్వాత ఉద్యోగులు సచివాలయంలో ఉండాల్సిన అవసరం లేదని సీఎం జగన్ స్వయంగా చెబితే.. ప్రవీణ్ ప్రకాష్ మాత్రం అర్థరాత్రి వరకు తన ఉద్యోగుల చేత పనులు చేయిస్తూ చుక్కలు చూపించేవాడని చెబుతారు.

రాత్రిళ్లు వాకింగ్ చేస్తూ.. అప్పటికప్పుడు తనకు వచ్చిన ఐడియాలను నమోదు చేయటానికి ఒక అధికారిని ఉంచుకునే వారని.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వ్యవహారశైలి మహా సిత్రంగా ఉంటుందని చెబుతారు.

ఇక.. రాష్ట్ర డీజీపీగా వ్యవహరించి.. తాజాగా ఆయన్ను బదిలీ చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురి చేస్తోంది. జగన్ ప్రభుత్వంలో మరే అధికారికి రానంత చెడ్డ పేరు గౌతమ్ సవాంగ్ కు వచ్చిందని చెబుతారు. ఏపీ పోలీసింగ్ పూర్తిగా అధికారపార్టీకి దాసోహం అన్న రీతిలో పని చేయించారన్న తీవ్ర ఆరోపణల్ని ఆయన్ను ఎదుర్కొన్నారు.

చంద్రబాబు హయాంలో విజయవాడ కమిషనర్ గా వ్యవహరించిన గౌతమ్ తీరు అప్పట్లో ప్రశంసల్ని పొందింది. అలాంటి అధికారి జగన్ ప్రభుత్వంలో వ్యవహరించిన తీరుపై వచ్చిన విమర్శలు..ఆరోపణలు అన్నిఇన్ని కావు.

మొన్నటికి మొన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న అయితే సంచలన హెచ్చరిక చేశారు. 2024లో వచ్చేది తమ ప్రభుత్వమేనని.. తమ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమ్ సవాంగ్ దేశంలో ఎక్కడున్నా సరే.. ఆయన్ను అరెస్టు చేయటం ఖాయమని.. ఆయన చేసిన పనులకు కేసులు నమోదు తప్పనిసరి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయటం ద్వారా ఒక అధికారపై విపక్ష నేత ఎంతటి ఆగ్రహంతో ఉన్నారన్న విషయం అర్థమయ్యేలా చేసిందని చెప్పాలి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. తాజాగా బదిలీ వేటు పడిన ఇద్దరు అత్యున్నత అధికారులు ఇద్దరు.. సీఎం జగన్ ఏరికోరి తెచ్చుకున్న వారు కావటం.. వారిద్దరిపైనా పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు రావటం.. ఇద్దరిని నెత్తిన పెట్టుకున్నజగన్.. తాను కోరినట్లుగా పనులు చేయించుకున్నారని.. రూల్ బుక్ ను వారిద్దరూ పూర్తిగా పక్కన పడేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

అలాంటి ఇద్దరిని బదిలీ పోటుతో నట్టేట ముంచేసిన వైనాన్ని  గర్తు చేసేలా జగన్ సర్కారు వ్యవహరించిందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. జగన్ ప్రభుత్వంలో ఒక రేంజ్లో చక్రం తిప్పిన ఇద్దరు అత్యున్నత అధికారులకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న విషయాన్ని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరని మాత్రం చెప్పక తప్పదు.
Tags:    

Similar News