మోత్కుపల్లికి నిరాశ...ఢిల్లీ గవర్నర్ ఖరారు
ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా నియామకం పూర్తి అయినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అనిల్ బైజాల్ ను ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న నజీబ్ జంగ్ సడెన్ గా రాజీనామా చేయడం.. ఆయన రాజీనామాను ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఆమోదించిన నేపథ్యంలో కేంద్రం కొత్త ఎల్ జీ కోసం కొన్ని పేర్లు పరిశీలించింది. చివరికి అనిల్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
1969 ఐఏఎస్ బ్యాచ్ యూనియన్ టెర్రిటరీస్ కేడర్ కు చెందిన అనిల్ బైజాల్ ను 2004లో యూపీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలగించింది. 2006లో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా రిటైరయ్యారు. ఆ తర్వాత చాలా కార్పొరేట్ కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా వ్యవహరించారు. గతంలో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఉన్న నజీబ్ జంగ్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరచూ కయ్యానికి దిగేవారు. ఢిల్లీ పరిపాలనలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జోక్యాన్ని కేజ్రీవాల్ తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో బైజాల్ కు లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా వ్యవహరించడం అంత సులువేమీ కాదు. నిజానికి బైజాల్ ను ఎన్ ఎన్ వోహ్రా స్థానంలో జమ్ముకశ్మీర్ గవర్నర్ గా నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఉగ్రవాది బుర్హాన్ వాని హత్య అనంతరం రాష్ట్రంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ మార్పు నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. కాగా ఈ పదవిలో టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు అవకాశం దక్కుతుందనే అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే ఈ దఫా కూడా నిరాశే ఎదురైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/