ఇక జగనన్న మార్టులు! ... సర్కార్ వారి నయా బిజినెస్...?

Update: 2022-03-07 00:30 GMT
ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి తెర లేవనుంది. ఇప్పటికే వివిధ రంగాల్లో వైసీపీ మార్క్ బిజినెస్ టాలెంట్ ని చూపించారు. అలా ఫిషరీస్ అవుట్ లెట్స్ ఇప్పటికే  ఏర్పాటు అయ్యాయి. మటన్ షాపులకు కూడా అంతా రెడీ అవుతోంది. మద్యం అమ్మకాలను సర్కారే చేస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా ఇపుడు కొత్తగా జగనన్న  మార్టులను తీసుకురాబోతోంది. ఏపీలో జగనన్న  మార్టులను పదమూడు జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతోంది.

ఇంతకీ ఈ మార్టులు ఏంటి వాటి కధా కమామీషూ ఏంటి అంటే చాలానే ఉంది అంటున్నారు. ఏపీలో డ్వాక్రా మహిళలు లక్షల్లో ఉన్నారు. వారి వద్ద చాలా పొదుపు సొమ్ము ఉంది. దానికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను కూడా మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇక డ్వాక్రా మహిళలు తన సొంత వ్యాపారాలు చేసుకుంటూ స్వయం సమృద్ధి సాధించి ఆర్ధికంగా బలపడాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం.

అయితే డ్వాక్రా మహిళల సొమ్ముతో మార్టులను ఏపీ నిండా ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కార్ సంకల్పించడమే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. ప్రతీ జిల్లాలో ఇలా మార్టులను పెద్ద ఎత్తున  నెలకొల్పి వాటిని  జగనన్న మార్టులుగా వాటిని తీర్చిదిద్దడమే వైసీపీ సర్కార్ లక్ష్యంగా ఇపుడు కనిపిస్తోంది.

జగనన్న మార్టులను విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా అయిదు వేల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. అలాగే నలభై వేల పై చిలుకు డ్వాక్రా సభ్యులు ఉన్నారు. వీరి నుంచి ఒక్కొక్కరి వద్ద రెండు వందల రూపాయలను పెట్టుబడిగా తీసుకుని జగనన్న మార్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా 80 లక్షల రూపాయల పెట్టుబడితో వీటిని నెలకొల్పుతారు.

ఇక్కడ ఈ మార్టులను డిపార్ట్మెంటల్ స్టోర్స్ మాదిరిగా నడుపుతారు. దీని పర్యవేక్షణ బాధ్యత అంతా అధికారులు చూస్తారు. అయితే ఈ మార్టులలో డ్వాక్రా మహిళలే పనిచేయాలిట.  అలాగే,  మీ సేవా కేంద్రాల భవనాలలో ఈ మార్టులను ఏర్పాటు చేస్తారు. వీటి లాభాలు కనుక వస్తే డ్వాక్రా మహిళలకు ఇస్తారు. అయితే ఇది ఆచరణలో అంత సక్సెస్ ఫుల్ గా నడుస్తుందా అన్నదే డౌట్.

పైగా డ్వాక్రా సంఘాల సభ్యుల పెట్టుబడితో మార్టులు పెట్టి పెత్తనం ప్రభుత్వం చేయడమేంటి అని డ్వాక్రా మహిళలు గురుమంటున్నారు.  పైగా తమ శ్రమను పెట్టుబడిని తీసుకుని   ఏ మాత్రం అధికారాలు ఇవ్వని ఈ మార్టుల గొడవ తమకెందుకని కూడా నిలదీస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ ఆలోచనను వారు వ్యతిరేకిస్తున్నారు.

అయితే  జగనన్న  మార్టులను ఏర్పాటు చేయాల్సిందే అని సర్కార్ నిర్ణయించిందని అంటున్నారు. ఇందుకోసం కచ్చితంగా డ్వాక్రా సభ్యుల వాటా కూడా ఉండాల్సిందే అంటున్నారు. ఈ పరిణామాలతో  డ్వాక్రా మహిళకు అయితే మండుతున్నారు. మొత్తానికి జగనన్న మార్టులకు రంగం అయితే సిద్ధమవుతోంది. మరి డ్వాక్రా మహిళలు దీని మీద ఏ రకంగా తన నిరసన వ్యక్తం చేస్తారో అన్నది చూడాలి.
Tags:    

Similar News