ఏపీ సచివాలయం ప్లేస్ మారింది

Update: 2016-02-12 03:48 GMT
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించాలని భావిస్తున్న ఏపీ సచివాలయానికి సంబంధించి రెండు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత అనుకున్నట్లు ఏపీ సచివాలయాన్ని 20 ఎకరాల్లో నిర్మించాలని భావించారు. అయితే.. తాజాగా అందుకు భిన్నంగా 45 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించటం గమనార్హం.

20 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏపీ సచివాలయాన్ని నిర్మించాలని భావించారు. ఇందుకు తగ్గట్లే అమరావతి టౌన్ షిప్ లో స్థలాన్ని ఎంపిక చేశారు. అయితే.. తాజాగా దాన్ని మారుస్తూ వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం గమనార్హం. అంతేకాదు.. మొదట అనుకున్న 20ఎకరాల్లో కాకుండా 45 ఎకరాల్లో సచివాలయాన్ని నిర్మించాలన్న నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నారు.

తాత్కాలిక సచివాలయంలో ప్రభుత్వ కాంప్లెక్స్ కోసం 27.08 ఎకరాలు.. ప్రజా సదుపాయాల కోసం 18.04 ఎకరాల్ని కేటాయిస్తున్నారు. దీని కోసం రూ.180కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తంలో రూ.90కోట్లు వడ్డీలేని రుణంగా హడ్కో నుంచి తీసుకుంటారు. ఇక.. తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం టెండర్లు పిలవటం.. అందుకు స్పందించి రెండు కంపెనీలు ముందుకు రావటం తెలిసిందే. ఈ రెండు కంపెనీలు వేసిన టెండర్లలో.. అడుగుకు రూ.3375 చొప్పున కోట్ చేసిన కంపెనీకి టెండర్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు చెబుతున్నారు. అడగు నిర్మాణానికి ఏపీ సర్కారు ఖరారు చేసిన మొత్తం భారీగా ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News