ఎక్కడైనా రైలుబండి...ఏపీలో దొంగల బండి

Update: 2015-09-19 11:19 GMT
ఇంతకముందు ఊరెళ్తున్నారంటే ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలన్న భయం ఉండేది.. ఇంట్లో దొంగలు పడి దోచుకుంటారేమో అని ఆందోళన చెందుతుండేవారు. ఇంటికి తాళం వేసి వెళ్లాలంటే భయం.. అలాంటిది ఇప్పుడు ఆ భయానికి ఇంకో భయం కూడా తోడైంది. ఇంటికి తాళం వేసి వెళ్తే ఇల్లు గుల్లవడం ఒకెత్తయితే... ప్రయాణంలో రైళ్లో దొంగలు ఒంటిమీద బంగారం - జేబులో డబ్బు - ఫోన్ లు కూడా దోచుకోవడం ఇంకో ఎత్తు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో రైలు ప్రయాణమంటే అంతా వణికిపోతున్నారు. ఒక్కోసారి దొంగలు మనకు తెలియకుండా దోచుకుంటుంటే... కొన్ని సందర్భాల్లో బెదిరించి దోచుకుంటున్నారు... ఇంకా కొందరైతే దోచుకున్నది చాలక ఒళ్లు హూనమయ్యేలా కొడుతున్నారు. ఇటీవల ఏకంగా ఓ ఐపీఎస్ అధికారిణినే చితకబాది బంగారం దోచుకున్నారు. రైళ్లో దోపిడీల విషయంలో ఏపీ ఇండియాలోనే టాప్ 5లో ఉందట.. ఒకప్పడు ఒరిస్సా - బీహార్ లలో రైలు ప్రయాణమంటే అంతా వణికేవారు కానీ.. ఇప్పుడు ఏపీ మీదుగావెళ్లే రైలెక్కాలంటే ఎవరూ డేర్ చేయడం లేదట.

నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో అత్యధిక రైలు దోపిడీలు జరిగిన రాష్ట్రాల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. 2014లో ఏపీలో రైళ్లలో ఏకంగా 1498 దోపిడీలు జరిగాయి. అంటే సగటున సుమారు రోజుకు నాలుగు రైలు దోపిడీలు జరిగాయన్న మాట. ఈ విషయంలో ఏపీ బీహార్ ను దాటిపోయింది.

మత్తుమందు ఇచ్చి దోచుకోవడం... తెలియకుండా చాకచక్యంగా దొంగిలించడం వంటి పాత పద్ధతులే కాకుండా ఇటీవల కాలంలో ఏకంగా రైలును ఆపి బోగీల్లో దూరి బెదిరించి దోచుకోవడం ఎక్కువవుతోంది. ప్రతిరోజూ దాదాపు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో ఏపీలో రైలు ప్రయాణాలంటే ప్రజలు భయపడుతున్నారు.
Tags:    

Similar News