ఆ అయిదింటి మీద‌నే ఆశ‌లు

Update: 2017-09-03 17:15 GMT
మోడీ క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో మిత్ర‌ప‌క్షాల‌కు మొండి చేయి చూయించారు. తొమ్మిదిమంది కొత్త వారికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టినా ఎన్డీఎలోని ప‌క్షాల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. వారితో క‌నీసం చ‌ర్చ‌లు కూడా జ‌ర‌ప‌లేదు అని స‌మాచారం. కేంద్రంలో ఎన్డీఎలోని విప‌క్షాలు ప‌క్క‌కు త‌ప్పుకున్నా బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టి ఉంది. అయితే ఎన్నిక‌ల ముందు ఆయా ప‌క్షాల‌తో క‌లిసి వివిధ రాష్ట్రాల‌లో పోటీ చేసిన నేప‌థ్యంలో త‌ప్ప‌నిస‌రై మోడీ కేంద్ర మంత్రి వ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పుడు ఆ అవ‌స‌రం లేదు కాబ‌ట్టి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భావిస్తున్నారు.

బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా లేని రాష్ట్రాల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చి ఎంపీలు ఉన్న తెలంగాణ‌ - ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు మొండి చేయి చూప‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆయా రాష్ట్రాల బీజేపీ నాయ‌క‌త్వాలు బ‌ల‌హీనంగా ఉన్నందునే బీజేపీ అధిష్టానం వారిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలుస్తుంది. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం లేకుంటే ప్ర‌జ‌ల వ‌ద్దకు వెళ్లి తాము ఏం చెప్పాల‌ని స్థానిక నేత‌లు వాపోతున్నారు.

అయితే కేంద్రంలో గ‌రిష్టంగా 81 మంది మంత్రుల‌ను నియ‌మించుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం కేంద్ర మంత్రుల సంఖ్య 73. ఆరుగురు మంత్రులు రాజీనామా చేయ‌డంతో ఆ సంఖ్య 67కు ప‌డిపోయింది. కొత్త‌గా తొమ్మిదిమంది ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో 76కు చేరుకుంది. అంటే ఇంకా అయిదుగురిని మంత్రివ‌ర్గంలోకి తీసుకునే అవ‌కాశం ఉంది. కొంత స‌మ‌యం తీసుకుని ఈ అయిదు స్థానాలు భ‌ర్తీ చేస్తార‌ని, అందులో అవ‌కాశం ద‌క్క‌క‌పోదా అన్న ఆశ‌తో బీజేపీ - ఎన్డీఎ భాగ‌స్వామ్య ప‌క్షాలు ఆశ‌తో ఉన్నాయి. మోడీ మ‌రి ఏ నిర్ణ‌యం తీసుకుంటాడో వేచిచూడాలి.
Tags:    

Similar News