జగన్ సినిమా రిలీజ్ అప్పుడేనట !
తరచూ జనంలోకి వస్తే పాదయాత్ర చేసిన నాటికి ఆ ఆకర్షణ అనుకున్న స్థాయిలో ఉండదని వైసీపీ హైకమాండ్ కి ఏవో ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.;
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గం నేతలతో కీలక సమావేశాన్ని తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు. పార్టీ నేతలకు క్యాడర్ కి భరోసా ఇస్తూనే కూటమి మీద ప్రత్యేకించి చంద్రబాబు మీద ఆయన విమర్శనాస్త్రాలను వదిలారు. జగన్ మార్క్ పంచ్ డైలాగ్ ఈ మీటింగులో ఏంటి అంటే బాబుకు సినిమా చూపిస్తామని. అయితే ఆ సినిమా రిలీజ్ అయితే ఇప్పట్లో లేదని తెలుస్తోంది.
కళ్ళు మూసుకుంటే చాలు :
జగన్ ఈ సమావేశంలో తన రొటీన్ స్పీచ్ నే ఇచ్చారు. చూస్తూండగానే రెండేళ్ళు ఇట్టే గడచిపోయాయి. మరో మూడేళ్ళూ ఇలాగే కళ్ళు మూసుకుంటే గడచిపోతాయని క్యాడర్ కి మనో ధైర్యం కల్పించారు. అదే సమయంలో చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతా ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. తాను కూడా మరో ఏడాదిన్నరలో జనంలోకి వస్తాను అని జగన్ ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చేశారు.
సినిమా చూపిస్తామంటూ :
తాను పాదయాత్ర కనుక మొదలెట్టి జనంలోకి వస్తే కనుక చంద్రబాబుకు ప్రతీ రోజూ ఒక సినిమానే చూపిస్తాను అని జగన్ చెప్పారు. పాదయాత్ర సాగినన్నాళ్ళూ కూటమి ప్రభుత్వాని ఎండగట్టి తీరుతామని జగన్ చెప్పారు. అంటే కూటమి అధినాయకత్వం జగన్ చూపించే సినిమా చూడాలి అంటే ఇంకా ఏణ్ణర్థం కాలం ఆగాలన్న మాట. ఇక ఈ మాటలతోనే మరో విషయం కూడా అర్ధం అవుతోంది అని అంటున్నారు. జగన్ నేరుగా పాదయాత్రతోనే జనంలోకి రావాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ లోగా ఆయన జిల్లాల పర్యటనలు కానీ బస్సు యాత్రలు కానీ ఉంటాయా అన్నది ఒక చర్చగా ఉంది. అయితే అలాంటివి ఏవీ లేకుండా నేరుగా పాదయాత్రతోనే ఫీల్డ్ లోకి దిగాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
ఆ ఇంపాక్ట్ కోసమేనా :
తరచూ జనంలోకి వస్తే పాదయాత్ర చేసిన నాటికి ఆ ఆకర్షణ అనుకున్న స్థాయిలో ఉండదని వైసీపీ హైకమాండ్ కి ఏవో ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం మీద ఇంకా ప్రజలలో ఎంతో కొంత ఆశలు ఉన్నాయని అంటున్నారు. మూడేళ్ళ పాలన పూర్తి అయితే అవన్నీ తొలగి పోతాయని ప్రజా వ్యతిరేకత బాహాటం అయి స్పష్టంగా కనిపిస్తుందని అపుడు జనంలోకి వెళ్ళినా ఫలితం ఉంటుందని భావిస్తునారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే పాదయాత్ర అన్నది భారీ కార్యక్రమంగా ఉండబోతోంది. ఈసారి జగన్ అయిదు వేల కిలోమేటర్లు చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. దానికి ఆర్థికంగా కూడా తట్టుకునేలా ఉండాలని అంటున్నారు. అందుకే దాని మీదనే ఫుల్ ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు.
ప్రజా పోరాటాలేవి :
అయితే జగన్ చెప్పినది బాగానే ఉంది అనుకున్నా ఆయన కాకపోయినా పార్టీ నేతలు ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది కదా అని అంటున్నారు. లేకపోతే జనంలో విపక్షం గట్టిగా ఉందన్న భావన కలిగేందుకు వీలు ఉండదు, అంతే కాకుండా ప్రభుత్వం మీద యాంటీ ఇంకెంబెన్సీకి పెంచేందుకు చాన్స్ ఉండదని అంటున్నారు తెలంగాణాలో చూస్తే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఉద్యమిస్తోంది. అలాగే బీజేపీ నేతలు కూడా వీలైన చోట్ల పోరాటాలు చేస్తున్నారు. కానీ ఏపీలో ఆ వాతావరణం లేదని అంటున్నారు. ఇవన్నీ సమీక్షించుకోవాల్సిన అవసరం వైసీపీ పెద్దల మీద ఉంది అని అంటున్నారు. ఒకేసారి సినిమా అయినా ఇబ్బందే అని ముందు ట్రైలర్స్ ని రిలీజ్ చేసుకుంటూ పోవడమే వ్యూహాత్మకమైన రాజకీయం అంటున్నారు. మరో వైపు వైసీపీ సినిమా చూపించే వరకూ కూటమి ఖాళీగా కూర్చోదు కదా అని అంటున్నారు. మూడు పార్టీలతో కట్టిన కూటమి బలంగా ఉంది కాబట్టి వైసీపీని ఎంతలా వీక్ చేయాలో చేసి చూపిస్తుందని కూడా అంటున్నారు.