అమరావతి కోసం చారిత్రాత్మక అసెంబ్లీ మీట్

రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కోసం ఈ నెల నిర్వహించేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ ని తాజాగా జారీ చేశారు. దీంతో శాసన సభ నిర్వహణకు రంగం సిద్ధం అయింది.;

Update: 2026-03-26 04:30 GMT

ఏపీకి అమరావతిని ఏకైక రాజధానిగా శాశ్వత రాజధానిగా ప్రకటించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అమరావతికి చట్ట బద్ధత కల్పించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకోబోతోంది. ఈ నెల 28న శనివారం అమరావతిని ఏపీకి రాజధానిగా ప్రకటిస్తూ ఒక తీర్మానాన్ని శాసనసభ ఆమోదించబోతోంది. దీని కోసం ఒక రోజు ప్రత్యేకంగా సభ నిర్వహించనున్నారు.

గవర్నర్ నోటిఫికేషన్ :

రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కోసం ఈ నెల నిర్వహించేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ ని తాజాగా జారీ చేశారు. దీంతో శాసన సభ నిర్వహణకు రంగం సిద్ధం అయింది. ఇక దాని కంటే ముందు ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. అందులో అమరావతి రాజధానిని ప్రకటించే తీర్మానంతో పాటు ఇతర అంశాల మీద చర్చ సాగుతుంది. వీటికి సంబంధించిన బిల్లులను కేబినెట్ ఆమోదించి సభలో ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు.

రాజముద్రకు రెడీ :

ఇక రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించనుంది. ప్రస్తుతం రెండవ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. దాంతో రాష్ట్రం పంపించిన ఈ తీర్మానాన్ని అందుకున్న వెంటనే కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో దానిని ఆమోదిస్తుంది. ఆ వెంటనే పార్లమెంట్ లో దానిని ప్రవేశ పెట్టి ఆమోదించనుంది అని అంటున్నారు. అంటే చాలా తొందరలోనే ఏపీకి అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధమైన నిర్ణయం వెలువడనుంది అన్న మాట. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆ ప్రక్రియ విజయవంతంగా ముగియనుంది.

చట్ట సవరణ ద్వారా :

ఇక ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని 5 (2)కి సవరణ చేయడం ద్వారా అని తెలుస్తోంది. ఆ విధంగా సవరణ జరిపిన తరువాత దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం గుర్తించినట్లుగానే ఏపీకి అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ రాజపత్రం విడుదల చేస్తుంది అని అంటున్నారు.

పదేళ్ళ కల :

అమరావతి రాజధాని అన్నది 2015 అక్టోబర్ 22న విజయదశమి పండుగ వేళ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ హాజరై శంకుస్థాపన చేశారు. ఆ విధంగా రాజధానికి పునాది రాయి పడింది. ఇక టీడీపీ ప్రభుత్వం హయాంలో కొంత వర్క్ జరిగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో మూడు రాజధానుల నినాదం అందుకుంది. ఆ అయిదేళ్ళూ అమరావతి పనులు ఏమీ అసలు జరగలేదు. అయితే కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధానిని టాప్ ప్రయారిటీగా చేసుకుని అడుగులు ముందుకు వేసింది. నిధులను కూడా పెద్ద ఎత్తున సమకూర్చింది. దాంతో ప్రస్తుతం నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. పెట్టుబడులకు సైతం ఆహ్వానిస్తున్నారు. చాలా మంది ఆ వైపుగా చూస్తున్నారు.

వైసీపీ వస్తుందా :

ఏపీకి సంబంధించి అతి ముఖ్యమైన ఘట్టంగా రాజధానిగా అమరవతిని గుర్తిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీసుకునే కీలక నిర్ణయంలో వైసీపీ భాగస్వామ్యం అవుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. ఇది రాజకీయాలకు సంబంధించిన ఇష్యూ అయితే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ. వైసీపీ స్టాండ్ కూడా దీని ద్వారా వ్యక్తం అవుతుంది అని అంటున్నారు. అమరావతి విషయంలో తాము వ్యతిరేకం కాదు అని వైసీపీ గట్టిగా చెప్పుకునేందుకు ఇది ఒక బంగారు అవకాశం అని అంటున్నారు. అదే సమయంలో తాము ఏమైనా సలహా సూచనలు చేసినా చేసేందుకు వీలు ఉంటుంది అని అంటున్నారు. మరి వైసీపీ ఈ సమావేశానికి హాజరవుతుందా లేదా అంటే వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News