నేనొక ప్రేమ పిపాసిని...ఆత్రేయ కంట కన్నీరు !
ఈ పాటలో పదాలు చూసినా భావాలు, భావోద్వేగాలు ఆత్మ సంఘర్షణ వంటివి చూసినా ఆత్రేయ మనసులో కలం ముంచి రాశారా అని అందరికీ అనిపిస్తుంది.;
ఇప్పటికి సరిగ్గా 48 ఏళ్ళ క్రితం 1978లో సంక్రాంతి పండుగకు వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మూవీ ఇంద్రధనస్సు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అందులో హీరోయిన్ గా శారద నటించారు. ఆ సినిమాకు పాటలు అన్నీ ఆచార్య ఆత్రేయ రాయగా సంగీతం స్వర బ్రహ్మ కేవీ మహదేవన్ సమకూర్చారు. మ్యూజికల్ గా కూడా క్రిష్ణ ఇంద్రధనస్సు మంచి హిట్. ఈ రోజుకీ అందులోని పాటలు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఎవర్ గ్రీన్ గా నిలిచిన సాంగ్ నేనొక ప్రేమ పిపాసిని అన్నది. ఇది ఒక విరహ గీతంగా అందరూ కనెక్ట్ అవుతూ పాడుకుంటూంటారు.
మనసులో కలం ముంచి :
ఈ పాటలో పదాలు చూసినా భావాలు, భావోద్వేగాలు ఆత్మ సంఘర్షణ వంటివి చూసినా ఆత్రేయ మనసులో కలం ముంచి రాశారా అని అందరికీ అనిపిస్తుంది. పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు సెగ రేపిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు అంటూ రాసిన వాక్యాలు విరహానికి ఇంతకంటే లోతైన నిర్వచనం ఉంటుందా అని కవి హృదయానికే కాదు సామాన్యులకు సైతం అనిపించకమానదు. తలుపు మూసిన తల వాకిటిలో పగలూ రేయి నిలుచున్నా పిలిచి పిల్చి నీ పిలుపే రాక అలసి సొలసి వెళ్తున్నా అని కూడా మరో చరణంలో ఆత్రేయ చెబుతారు.
హృదయ తంత్రులను మీటి :
ఇక ఈ పాటకు మామ మహదేవన్ హృదయ తంత్రులను మీటి మరీ గుండెలను హత్తుకునే సంగీతాన్ని అందించారు. మూడు చరణాలూ సంగీత ప్రవాహంగా నేరుగా మనసుని తాగుతూ సాగుతాయి. ఇక గాన గంధర్వుడు బాలు అద్భుతంగా ఈ పాటను ఆలపించారు. ఆయన గొంతులో విరహం అలవోకగా పలుకుతుంది అన్నది అనేక పాటలు రుజువు చేశాయి. అయితే అవన్నీ ఒక ఎత్తు ఇది మరో ఎత్తు, గుండె పొరలలో దాగున్న భావన కొట్టుమిట్టాడుతూ బయటకు రాలేక నలిగిపోతున్న ఆ వ్యధను బాలు తన ప్రతిభావంతమైన గానంతో తెలియచేస్తారు.
ఆత్రేయ కరిగిపోయి :
ఎన్నో వేల పాటలు రాశారు ఆత్రేయ. అందులో దాదాపుగా ఎక్కువ శాతం మనసు పాటలే. ఇక ప్రేమ గీతాలు విరహ గీతాలకు ఆయన పెట్టింది పేరుగా నిలిచారు. అయినా సరే ఈ పాట ఆయన హాట్ ఫేవరేట్ గా ఉంది. అందులో హార్ట్ టచింగ్ గా ఆయనని హంట్ చేసింది అని అంటారు. ఈ పాట రికార్డింగ్ టైం లో స్టూడియోలో ఉన్న ఆత్రేయ బాలు పాట పాడి బయటకు రాగానే దగ్గరకు తీసుకుని కన్నీరు పెట్టుకున్నారుట. అంతే కాదు అనేక సందర్భాలలో బాలు కనిపించినప్పుడల్లా ఈ పాటను కోరి మరీ ఆయన చేత పాడించుకుని అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయేవారుట. స్వరాభిషేకం పాడుతా తీయగా కార్యక్రమాలలో బాలూ ఈ పాటను గురించి చెబుతూ ఆత్రేయకి ఎంతో ఇష్టమైన పాట ఇది అని చెప్పుకొచ్చారు. ఆత్రేయకే కాదు విన్న ప్రతీ వారికీ హార్ట్ టచింగ్ సాంగ్ ఎవర్ గ్రీన్ అంటే నేనొక ప్రేమ పిపాసిని అనే అంటారు. ఇక తెర మీద క్రిష్ణ కూడా అద్భుతంగా నటించారు. అక్కినేనికి మాత్రమే సాధ్యమైన విరహ భావాలని క్రిష్ణ కూడా తన నటనతో చేసి చూపించి శభాష్ అనిపించుకున్నారు.