ఎనర్జీ లాక్ డౌన్...ట్రెండింగ్ లో కొత్త భయం
గల్ఫ్ యుద్ధం మూలంగా ప్రస్తుతం ప్రపంచం అంతా ఇంధన సంక్షోభంలో చిక్కుకుంది. భారత్ అయితే తన మొత్తం ఇంధన అవసరాలలో అరవై శాతం పైగా గల్ఫ్ దేశాల నుంచే తీసుకుంటోంది.;
కరోనా మహమ్మారి గురించి అందరూ చేదు జ్ఞాపకాలను మనసులో దాచుకుంటారు. కరోనా అయితే చాలా గుణ పాఠాలు చెప్పింది. అలాగే చాలా విషయాలను ఏ తరానికి తెలియనివి ఈ తరానికి చెప్పింది. అందులో ఒకటి లాక్ డౌన్ అన్న పదం. అప్పటిదాకా ఆ పదం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ లాక్ డౌన్ అంటో ఏమిటో నెలల పాటు భారత్ చవి చూసింది. ప్రపంచం కూడా దాదాపుగా అదే స్థితిలో ఉంది. ఇపుడు అలాంటి మరో పదం కూడా ట్రెండింగ్ అవుతోంది. దాని పేరు ఎనర్జీ లాక్ డౌన్. ఇంతకీ ఈ పదం వెనక అర్ధం ఏమిటి దాని వెనకాల ఉన్న భయాలు ఏమిటి అంటే లోతుల్లోకి వెళ్ళాల్సిందే.
మరో కరోనా మాదిరి:
భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే గల్ఫ్ యుద్ధం మొదట్లో పెద్దగా మాట్లాడలేదు, అదే సమయంలో భారత్ మొత్తం అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. ఎట్టకేలకు మూడు వారాలకు గల్ఫ్ యుద్ధం చేరుకున్నాక ప్రధాని నరేంద్ర మోడీ మొదట లోక్ సభలో ఆ తరువాత రాజ్యసభలోనూ కీలక ప్రకటన ప్రభుత్వం తరఫున చేశారు. అందులో కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమి చేసింది చెబుతూనే సవాళ్ళు ఉన్నాయని చెప్పకనే చెప్పేశారు. అంతే కాదు కరోనా లాంటి పరిస్థితులు అన్న పదం కూడా వాడారు. దాంతోనే జనాలలో తీవ్ర కలవరం రేగింది. అయితే ఏమి జరుగుతుంది అని అంతా ఆలోచిస్తున్నారు. మళ్ళీ లాక్ డౌన్ తప్పదా అన్న చర్చ కూడా మొదలైంది. అయితే ఈసారి లాక్ డౌన్ అంటూ పెడితే అది ఇంధన వనరుల మీదనే అన్న చర్చ కూడా సాగుతోంది.
ఇంధన సంక్షోభం :
గల్ఫ్ యుద్ధం మూలంగా ప్రస్తుతం ప్రపంచం అంతా ఇంధన సంక్షోభంలో చిక్కుకుంది. భారత్ అయితే తన మొత్తం ఇంధన అవసరాలలో అరవై శాతం పైగా గల్ఫ్ దేశాల నుంచే తీసుకుంటోంది. ఇపుడు అక్కడే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది కానీ యుద్ధం ఇదే తీరు సాగితే మాత్రం దేశంలో ఇంధన సమస్యలు పతాక స్థాయికి చేరడం ఖాయమని అంటున్నారు. అదే కనుక జరిగితే కచ్చితంగా ఎనర్జీ లాక్ డౌన్ పెట్టే చాన్స్ ఉంటుందని అంటున్నారు.
ఇతర దేశాలలో మొదలు :
ఇప్పటికే ఇతర దేశాలలో ఎనర్జీ లాక్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం గ్యాస్ వంటి వాటికి కొరత ఏర్పడిన క్రమంలో చాలా దేశాలు ఇంధన వాడకాన్ని తగ్గించుకునేందుకు కఠిన నియంత్రణను పాటిస్తూ వస్తున్నారు. ఆంక్షలు కూడా చాలా దేశాలలో అమలు అవుతున్నాయి. అలా చూస్తే కనుక ఆఫీసులకు వచ్చే వారిని ఇంటి నుంచే పని చేయమనడం, అలాగే పాఠశాలకు తక్కువ పని దినాలు పెట్టడం, విరివిగా వాడే కార్లు ట్రక్కులు ఇతర వాహనాలకు పరిమితులు విధించడం పెట్రోల్ బంకులలో రేషన్ పద్ధతిలో తక్కువ పెట్రోల్ డీజిల్ వంటివి సరఫరా చేయడం జరుగుతోంది. ఈ విధమైన పరిస్థితులు అయితే జన జీవనాన్ని కదలకుండా చేస్తాయి. ఒక విధంగా లాక్ డౌన్ మాదిరిగానే ఉంటుంది అని అంటున్నారు.
అనివార్యం అయితే :
అయితే ఎవరూ కోరి ఈ ఎనర్జీ లాక్ డౌన్ కి సిద్ధపడరు, ఎందుకంటే దీని వల్ల ఆర్థిక పరిస్థితుల మీద కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. అన్ని రకాలుగా ద్రవ్యోల్బనం పెరిగిపోతుంది. జన జీవనం సమస్యల మయం అవుతుంది. అయితే అటువంటి అనివార్యత కనుక వస్తే మాత్రం తప్పదని అంటున్నారు. అపుడు ఇంధనం తక్కువైతే చిన్న మధ్య స్థాయిలలో ఎనర్జీ లాక్ డౌన్ వంటి నిర్ణయాలు తీసుకోవడం ఖాయమని అంటున్నారు. దీని వల్ల వారంలో కొన్ని రోజులు మాత్రమే ఆఫీసులు పనిచేస్తాయి. అలాగే స్కూళ్ళు, కాలేజీలకు ఆన్ లైన్ లోనే బోధన జరుగుతుంది. ఇక వర్క్ ఫ్రం హోం మొదలవుతుంది, కార్ పూలింగ్ వంటివి అంటే ఒకే కారులో ఎక్కువ మంది ప్రయాణించడం పబ్లిక్ ట్రాన్స్ పోర్టుని ఎక్కువగా ఉపయోగించేలా చేయడం ఇలా జరుగుతాయని అంటున్నారు. ఇక చూస్తే భారత్ లో ఆయిల్ ఇప్పటికి మరో పది రోజుల పాటు సరిపోయేలా ఉందని అంటున్నారు. ఇంకా చమురుతో నౌకలు దేశానికి వస్తున్నాయి. అందువల్ల కొంతవరకూ ఫరవాలేదు కానీ యుద్ధానికి ఒక ముగింపు రావాలి, లేకపోతే మాత్రం ఏ వైపు నుంచి ఏ లాక్ డౌన్ తగులుకుంటుందో చెప్పలేమని అంటున్నారు.