ఏపీలో మరో దారుణం: 13 మంది సజీవదహనం.. పలువురికి తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.;

Update: 2026-03-26 03:49 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్షణాల్లోనే మంటలు బస్సు, టిప్పర్‌ను చుట్టుముట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారని అధికారులు ధృవీకరించారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని సమీపంలోని మార్కాపురం ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు.

హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో అతివేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ఢీకొన్న వెంటనే ఇరువాహనాల్లో మంటలు చెలరేగడంతో పరిస్థితి నియంత్రణలో లేకుండా పోయింది. బస్సు వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే ముందు భాగంలో ఉన్న కొందరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగలిగారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద తీవ్రత కారణంగా బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమై గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాయి.

మృతుల్లో కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఘటనాస్థలాన్ని మార్కాపురం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ పరారీలో ఉండటం గమనార్హం. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రజలకు సహాయార్థం కంట్రోల్ రూమ్ నంబర్లు కూడా విడుదల చేశారు. 6304285613, 9985733999. ఈ దుర్ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News