జీవన్ రెడ్డొచ్చి మొదలెట్టారా...రేవంత్ మీద ఆ ముద్ర !

కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్ జీవన్ రెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్ లో 1983 నుంచి ఎమ్మెల్యేలుగా చేసిన వారు పెద్దగా లేరు.;

Update: 2026-03-26 05:30 GMT

కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్ జీవన్ రెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్ లో 1983 నుంచి ఎమ్మెల్యేలుగా చేసిన వారు పెద్దగా లేరు. జానా రెడ్డి జీవన్ రెడ్డి. వీ హనుమంతరావు వంటి పాత తరం నేతలు అలా కనిపిస్తారు. ఇక 2000 తరువాత వచ్చిన నేతలే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ లో పాత తరం నేతగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వారిగా ఉన్న జీవన్ రెడ్డి విసిగి వేసారి హస్తం పార్టీకి గుడ్ బై కొట్టేశారు. ఆయన 1983లో తెలుగుదేశం పార్టీ టికెట్ పైన అన్న ఎన్టీఆర్ ఆశీస్సులతో తొలిసారి జగిత్యాల నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి నాలుగు దశాబ్దాలుగా ఆ పార్టీని అట్టే బెట్టుకుని ఉన్నారు.

రేవంత్ రెడ్డితోనే :

జీవన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ చెడింది అన్న చర్చ అయితే సాగుతోంది. కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి తగిన గౌరవాన్ని కోరుకున్నారు. అదే సమయంలో కీలకమైన పదవుల కోసం ఆయన ప్రయత్నం చేశారు. పీసీసీ చీఫ్ గా 2021లో ఆయన బాధ్యతలను అందుకోవాలని చూశారు. అప్పటికి పీసీసీ చీఫ్ గా ఉన్న నల్గొండ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లేస్ లోకి రావాలని అనుకున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ ఉన్నపుడే వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన కూడా తనదైన శైలిలో ప్రయత్నం చేసి పీసీసీ చీఫ్ అయ్యారు. అయితే తనకు కాకుండా ఆ పదవి టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి దక్కేలా చేయడంతో తెర వెనక పెద్ద శక్తులు పనిచేశాయని జీవన్ రెడ్డి భావించారు. అంతే కాదు రేవంత్ రెడ్డికి టీడీపీ పెద్దల పరోక్ష సాయం దక్కిందని ఆ విధంగా కేరళకు చెందిన ఏఐసీసీ కీలక నేత ద్వారా ఈ వ్యవహారంలో తనకు పీసీసీ చీఫ్ దక్కకుండా పోయిందని భావించారు.

మరోసారి ఆశాభంగం :

ఇక రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మరోసారి పీసీసీ చీఫ్ పదవి కోసం జీవన్ రెడ్డి ట్రై చేశారని అంటున్నారు. అయితే తాను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టి బీసీలకు ఆ కీలక పదవి ఇవ్వడం సమంజసం అని రేవంత్ రెడ్డి చక్రం తిప్పారని దాంతో ఆ పదవి మహేష్ కుమార్ గౌడ్ కి దక్కింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏడాది క్రితం జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి పూర్తి అయిపోయింది. ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని రెన్యూవల్ చేయలేదు సరికదా పక్కన పెట్టేశారు అన్న ఆవేదన ఉంది. అంతే కాదు కీలక పదవులకు దూరం పెట్టడం తనను జగిత్యాలలో 2023లో ఓడించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తనకు చెప్పకుండా కాంగ్రెస్ లోకి తీసుకుని రావడం ఇవన్నీ పొగబెట్టిన చర్యలుగా భావించిన జీవన్ రెడ్డికి తాజాగా మరో పరిణామం పుండు మీద కారంగా మారింది అని అంటున్నారు. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రెండు ఎంపీ పదవులు ఉంటే అందులో ఒకటిని ఆయన ఆశించారు అని కానీ రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన తన మిత్రుడికి ఆ పదవి ఇప్పించుకోవడంతో ఇక కాంగ్రెస్ లో ఉంటే లాభం లేదని భావించే తప్పుకున్నారు అని అంటున్నారు.

టీడీపీ ముద్రతో :

రేవంత్ రెడ్డిని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న పాతతరం కాంగ్రెస్ నేతలలో జీవన్ రెడ్డి ముందుంటారు. ఆయన పార్టీని వీడిపోతూ టీడీపీ నుంచి వచ్చిన నేతగానే రేవంత్ రెడ్డి మీద విమర్శలు గుప్పించారు. ఇక మీదట తన పోరాటం ఆయనతోనే అని గట్టిగా చెప్పేశారు. కాంగ్రెస్ లో ఇప్పటికే పాత తరం నేతలు అయితే గుర్రుగా ఉన్నారని అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అయితే వారు ఎవరూ తమ బాధను కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారు. ఈ నేపధ్యంలో జీవన్ రెడ్డి బయటకు వచ్చారు. ఈ రెడ్డి గారి బాటలో ఎంత మంది కాంగ్రెస్ లోపల బయటా తమ అసంతృప్తి గళం విప్పుతారు అన్నదే చర్చ. ఇక రెండు జిల్లాలలో తన అనుచర బలం కలిగిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ ని వీడడం కీలక పరిణామం గానే కాంగ్రెస్ అగ్ర నేతలు చూస్తారా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో అందరినీ కలుపుకుని పోతున్నారు అన్న పేరు ఇప్పటిదాకా ఉంది. ఇపుడు జీవన్ రెడ్డి ఎపిసోడ్ కొత్త ఇబ్బందిగనే చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఇది కాంగ్రెస్ లో పెద్దది కాకుండా చేసుకోవడమే ఒక సవాల్ అని అంటున్నారు.

Tags:    

Similar News