రోజాను కరుణించని కోడెల

Update: 2016-03-19 07:17 GMT
దేవుడు కరుణించిన పూజారి కరుణించలేదు అన్నట్లుగా ఉంది వైసీపీ ఎమ్మెల్యే రోజా పరిస్థితి. తనపై విధించిన సస్పెన్షన్ చెల్లదని కోర్టు ఉత్తర్వులిచ్చినా కూడా అసెంబ్లీలోకి వెళ్లడం ఆమెకు వీలవడం లేదు. స్పీకరు అందుకు అనుమతించకపోవడంతో ఆయన ఆదేశాల ప్రకారం మార్షల్సు ఆమెను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. రెండు రోజులుగా సాగుతున్న ఈ వ్యవహారం తాజాగా పీక్ స్టేజికి చేరింది. అసెంబ్లీలో శనివారం వైసీపీ ఎమ్మెల్యేలంతా నిరసన తెలపగా రోజా అసెంబ్లీ బయట నేలపైనే నిద్రించి నిరసన తెలిపారు. దీంతో రోజా పట్ల క్రమంగా సానుభూతి పెరుగుతోంది.
   
మరోవైపు వైసీపీ నుంచి నిరసనలు పెరగడం.. రోజా కూడా ప్రజల దృష్టిని ఆకర్షించేలా నిరసనకు దిగడంతో ఆమెను ఈ రోజుకు నిలువరించే ఎత్తుగడలో భాగంగా సభను ఏకంగా సోమవారానికి వాయిదా వేశారు. దీంతో మళ్లీ సోమవారం వరకు రోజాకు అవకాశం లేనట్లే. రోజా విషయంలో కోర్టు తీర్పుపై ఏపీ శాసనసభ అప్పీలుకు వెళ్లిన సంగతి తెలసిందే.. ఆ కేసు కూడా సోమవారం విచారణకు రానుంది. సోమవారం కోర్టు నిర్ణయం బట్టి స్పీకరు నిర్ణయం తీసుకునే సూచనలున్నాయి. కోర్టు మునుపటి నిర్ణయం అమలుచేయకుండా ఆగడానికి ఏమాత్రం వెసులుబాటు దొరికినా రోజాకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. లేదంటే మాత్రం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది కాబట్టి రోజాను సభకు అనుమతించే అవకాశాలుంటాయి. ఏది ఏమైనా సోమవారం దీనిపై ఒక క్లారిటీ రానుంది.
Tags:    

Similar News